వడోదర: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్ కోసం టీమిండియా సమాయత్తమవుతోంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య ఆదివారం తొలి వన్డే జరగనుంది. ఈ నేపథ్యంలో భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ ప్రాక్టీస్‌లో నిమగ్నమయ్యారు. శుక్రవారం జరిగిన సెషన్‌లో కోహ్లి, రోహిత్ మంచి టచ్‌లో కనిపించారు. నెట్స్‌లో వీరిద్దరూ గంటన్నర పాటు పేసర్లు, స్పిన్నర్లను ఎదుర్కొన్నారు. ఆ తర్వాత త్రోడౌన్ స్పెషలిస్ట్ బంతులను ప్రాక్టీస్ చేశారు.
టి20, టెస్టు ఫార్మాట్‌లకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరూ... ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో రెండు సెంచరీలు బాదిన కోహ్లి న్యూజిలాండ్‌పై కూడా అదే జోరు కొనసాగించాలని చూస్తున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో వీరిద్దరూ చెరో రెండు మ్యాచ్‌లు ఆడి ఫామ్ చాటుకున్నారు. కెపె్టన్ శుబ్‌మన్ గిల్ కూడా నెట్స్‌లో చమటోడ్చాడు.
గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో చివరి రెండు టి20లకు దూరమైన అతడు... ఇప్పుడు పూర్తిగా కోలుకొని ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. గురువారం తమ రాష్ట్ర జట్ల తరఫున విజయ్ హజారే మ్యాచ్‌లు ఆడిన శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, మొహమ్మద్ సిరాజ్ శుక్రవారం ప్రాక్టీస్‌లో పాల్గొనలేదు. వన్డే సిరీస్ అనంతరం భారత జట్టు న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ కూడా ఆడనుంది. ఆ వెంటనే ఐసీసీ టి20 ప్రపంచకప్ జరగనుంది.


