జాతి గర్వించదగ్గ క్రికెటర్లలో స్మృతి మంధాన (Smriti Mandhana) ఒకరు. భారత జట్టు ఓపెనర్‌గా, వైస్ కెప్టెన్‌గా మహిళా క్రికెట్‌పై ఆమె ముద్ర ప్రత్యేకం. మహారాష్ట్రలోని సాంగ్లీ అనే చిన్న పట్టణంలో 1996, జూలై 18న జన్మించింది స్మృతి.
ఆమె తల్లిదండ్రులు స్మిత మంధాన, శ్రీనివాస్ మంధాన. తండ్రి, అన్నని చూసి క్రికెటర్ కావాలన్న కోరిక చిన్న వయసులోనే స్మృతి మనసులో బలంగా నాటుకుపోయింది. అందుకు తగ్గట్టుగానే తండ్రి ప్రోత్సాహంతో ఆశయం దిశగా అడుగులు వేసింది.
తొమ్మిదేళ్ల వయసులో
ఈ క్రమంలో తొమ్మిదేళ్ల వయసులో స్మృతి మంధాన మహారాష్ట్ర అండర్-15 జట్టుకు ఎంపికైంది. పదకొండేళ్లకు అండర్-19 టీమ్ స్థాయికి చేరుకుంది. అత్యంత పిన్న వయసులోనే అంటే.. పదహారేళ్లకే 2013లో స్మృతి భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూసుకోలేదు.
మధ్యలో కొన్ని అవాంతరాలు ఎదురైనా మొక్కవోని సంకల్పంతో ఓపెనర్‌గా రికార్డులు కొల్లగొడుతూ స్మృతి అగ్ర పథంలో దూసుకుపోతోంది. అత్యుత్తమ అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌గా అవార్డు అందుకుంది.
వరల్డ్‌కప్ చాంపియన్‌గా
భారత జట్టు వైస్ కెప్టెన్ స్థాయికి చేరుకున్న 29 ఏళ్ల స్మృతి.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 గెలవడంలో తన వంతు పాత్ర పోసించి.. వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలిచింది. అయితే, క్రికెటర్‌గా ఎదిగే క్రమంలో స్మృతికి, ఆమె తల్లిదండ్రులకు అవహేళనలే ఎదురయ్యాయి.
సగటు భారతీయ తండ్రి
ఈ విషయం గురించి స్మృతి మంధాన 2023లో కౌన్ బనేగా కరోడ్‌పతి 15 షోలో స్పందించింది. హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అవును సర్.. నాకు, మా అన్నయ్యకు చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే చాలా ఇష్టం. నాన్న కూడా క్రికెటర్ కావాలని అనుకున్నాడు. కానీ ఆయన కుటుంబం అందుకు అవకాశం ఇవ్వలేదు. క్రీడల్లోకి వెళ్లాలనే ఆలోచన పక్కనపెట్టమని చెప్పారు.
అందుకే నాన్న తన కల మా ద్వారా నెరవేరితే బాగుండని కోరుకున్నారు. సగటు భారతీయ తండ్రిగా ఆయన కోరిక అది. నేను మా అమ్మ గర్భంలో ఉన్నప్పటి నుంచే ఆయన ఈ కల కన్నారు. మా అన్నతో కలిసి నేను క్రికెట్ ఆడేదాన్ని.
అన్న నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తున్నపుడు అతడి బ్యాటింగ్ శైలిని పరిశీలించేదాన్ని. నిజానికి నేను రైటీని (కుడిచేతి వాటం). మా అన్న లెఫ్టీ. అన్నను చూసే బ్యాటింగ్ చేస్తూ లెఫ్టాండర్‌గా మారిపోయా.
అందరు ఆడపిల్లల తల్లిదండ్రుల్లాగే మా వాళ్లకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. స్పోర్ట్స్ పర్సన్ జీవితం అంత సాఫీగా ఉండదని మా వాళ్లను చాలా మంది నిరుత్సాహపరిచారు. ఒక రకంగా మా వాళ్లను వేధించారు కూడా!
తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు?
ఎండలో ఆడితే ఆమె ముఖం కందిపోతుంది. నల్లబడుతుంది. అలాంటపుడు తనను ఎవరు పెళ్లి చేసుకుంటారు? అంటూ భయపెట్టారు. అయినా సరే నా తల్లిదండ్రులు నన్ను వెనక్కి లాగలేదు. క్రికెట్ ఆడేలా ప్రోత్సహించారు’’ అని స్మృతి మంధాన గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుంది.
తన, తండ్రి ఆశయానికి తగ్గట్టుగా క్రికెటర్‌గా ఎదిగిన స్మృతి.. అత్యుత్తమ వన్డే మహిళా క్రికెటర్‌గా నీరాజనాలు అందుకుంటోంది. ఇప్పటి వరకు భారత్ తరఫున 7 టెస్టులు ఆడి 629, 117 వన్డేల్లో 5322, 153 టీ20లలో 3982 పరుగులు సాధించింది. అండర్-19 స్థాయిలో లిస్ట్-ఎ మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించిన మహిళా క్రికెటర్ స్మృతి.
ఉన్నత శిఖరాలకు
ఇక మహిళల ప్రీమియర్ లీగ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు తొలి టైటిల్ అందించిన కెప్టెన్. కెరీర్ పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్న స్మృతి.. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత పెళ్లి బంధంలో అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
మనసిచ్చిన ప్రియుడు పలాష్ ముచ్చల్‌తో ఏడడుగులు వేసే క్రమంలో హల్దీ, సంగీత్ వేడుకల్లో ఆడిపాడింది. కానీ ఆఖరి నిమిషంలో తండ్రి అస్వస్థతకు గురికావడంతో పెళ్లి నిరవధికంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో పలాష్‌పై సంచలన ఆరోపణలు వస్తున్నాయి. చంచల మనసు గల అతడు స్మృతిని మోసం చేశాడని.. అది తెలిసే స్మృతి తండ్రికి గుండెపోటు వచ్చిందనే వదంతులు వస్తున్నాయి.
ఊహించని విధంగా.. ఇప్పుడిలా
ఏదేమైనా క్రికెటర్ అయితే.. పెళ్లి కాదంటూ స్మృతిని వెక్కిరించిన వాళ్లకు ఆటతోనే ఆమె సమాధానం ఇచ్చింది. దేశాన్ని గర్వపడేలా చేసి ప్రపంచకప్‌ను ముద్దాడింది. అయితే, వ్యక్తిగత జీవితంలో మాత్రం ఇలా ఊహించని చేదు అనుభవాన్ని చవిచూసింది. అంతా సజావుగా సాగి స్మృతి వివాహ బంధంలో అడుగుపెడితే చూడాలని ఆమె సన్నిహితులు, అభిమానులు కోరుకుంటున్నారు.
చదవండి: Smriti Mandhana Vs Palash Muchhal: ఎవరి నెట్‌వర్త్ ఎంత?


