కాంగ్రెస్ నేత వినయ్ కుమార్ డోకానియా సెటైర్లు
''కేవలం సంవత్సరం కాలంలో టీమిండియాకు అద్భుతమైన విజయాలను అందించిన గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్‌లకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను'' అంటూ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా జాతీయ కోఆర్డినేటర్ వినయ్ కుమార్ డోకానియా (Vinay Kumar Dokania) సెటైర్ వేశారు. సొంతగడ్డపై టెస్టుల్లో రెండో విజయవంతమైన వైట్‌వాష్‌కు అభినందనలు అంటూ చురక అంటించారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండు టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమిండియా చిత్తుగా ఓడిన నేపథ్యంలో.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లపై ఎక్స్ వేదికగా ఆయన వ్యంగ్యాస్త్రాలు, విమర్శలు గుప్పించారు. వీరిద్దరినీ తొలగించకపోతే భారత క్రికెట్‌కు భారీ నష్టం తప్పదని హెచ్చరించారు. 80, 90లలో కూడా భారత టెస్ట్ జట్టు ఇంత బలహీనంగా లేదని.. అగార్కర్, గంభీర్ వల్లే ఇప్పుడు అది సాధ్యమైందని దుయ్యబట్టారు. కోచ్ పదవికి గంభీర్ తనంత తానుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
వారిద్దరినీ తొలగించాలి
పటిష్టమైన భారత టెస్ట్ జట్టును గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) భ్రష్టు పట్టించాడని, టి20 ఆల్ రౌండర్ల టీమ్‌గా మార్చేశాడని వినయ్ కుమార్ ధ్వజమెత్తారు. టి20 క్రికెటర్లతో నిండిన ఈ భారత జట్టు కంటే ఇంట్లోని చిన్న పిల్లలు బాగా క్రికెట్ ఆడతారని వ్యంగ్యంగా అన్నారు. అసంబద్ధ నిర్ణయాలతో ఇండియన్ క్రికెట్ జట్టును గంభీర్ ఎగతాళి చేశాడని మండిపడ్డారు. టీమిండియా 2027లో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ ఆడుతుందని.. గంభీర్, అగార్కర్‌లను తొలగించకపోతే మన జట్టు 5-0 తేడాతో ఓడిపోతుందని ఆయన జోస్యం చెప్పారు.
భారత టెస్ట్ క్రికెట్ హంతకుడు
అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి.. టెస్ట్ క్రికెట్ నుంచి అవమానకరంగా రిటైర్ కావడానికి గంభీర్ కారణమయ్యాడని వినయ్ కుమార్ ఆరోపించారు. అసమర్థ టి20 క్రికెటర్లతో టెస్ట్ జట్టును నింపేశారని అన్నారు. తెలివితక్కువ, ప్రమాదకరమైన ప్రయోగాలతో ఆటగాళ్ల ప్రతిభను, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీశారని విమర్శించారు. గౌతమ్ గంభీర్‌ను భారత టెస్ట్ క్రికెట్ హంతకుడిగా అభివర్ణించారు. క్రికెట్ కోచింగ్ ఆయనకు సరిపడదని, రాజకీయాల్లోకి తిరిగి వెళ్లాలని గంభీర్‌కు సలహాయిచ్చారు. గంభీర్ తన అద్భుతమైన కోచింగ్, జట్టు కూర్పుతో 2027 సీజన్‌లో ఇండియాను WTC ఫైనల్స్‌కు వెళ్లకుండా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
సక్సెస్ రేటు డౌన్
2016 నుంచి 2019 వరకు సొంతగడ్డపై టీమిండియా విజయాల శాతం 79 కాగా, 2020 నుంచి 2024 వరకు 73 శాతం సక్సెస్ రేటు సాధించిందని వినయ్ కుమార్ గుర్తు చేశారు. 2024 అక్టోబర్ నుంచి ఇది 29 శాతానికి పడిపోయిందని వెల్లడించారు. ఇంతటి ఘనత సాధించిన గౌతమ్ గంభీర్‌కు ధన్యవాదాలు అంటూ సెటైర్ వేశారు.
చదవండి: భారత్ టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది
13 నెలల్లో ఆరుగురు..
టీమిండియా టెస్ట్ టీమ్‌లో కీలకమైన మూడో స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయలేకపోయారని విమర్శించారు. రాహుల్ ద్రవిడ్ 15 ఏళ్లు, ఛతేశ్వర్ పుజారా పదేళ్ల పాటు మూడో స్థానంలో బ్యాటింగ్ చేశారని గుర్తు చేశారు. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత 13 నెలల కాలంలోనే ఆరుగురిని మార్చారని తెలిపారు. శుబ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, పడిక్కల్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్‌లను మూడో స్థానంలో ఆడించిన విషయాన్ని వెల్లడించారు.
I demand Bharat Ratna from Indian govt for Gautam Gambhir and Ajit Agarkar for these herculean achievements for Team India in just 1 year #IndvsSA pic.twitter.com/z5JpekDHFm
— Vinay Kumar Dokania (@VinayDokania) November 26, 2025


