దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా బ్యాటర్ సాయి సుదర్శన్ (Sai Sudharsan) ఓర్పుతో బ్యాటింగ్ చేశాడు. వికెట్ కాపాడుకునేందుకు చాలాసేపు క్రీజులో పాతుకుపోయాడు. సఫారీల పదునైన బంతులను ఎదుర్కొనేందుకు బాగా కష్టపడ్డాడు. వికెట్ పడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించి విజయవంతం కాలేకపోయాడు. ముత్తుసామి బౌలింగ్‌లో మార్క్‌రమ్‌కు క్యాచ్ ఇచ్చి ఆరో వికెట్‌గా అవుటయ్యాడు.
27/2 ఓవర్‌నైట్ స్కోరుతో చివరి రోజు ఆట ప్రారంభించిన టీమిండియా లంచ్ విరామానికి ముందు 31 పరుగులు మాత్రమే జోడించి మరో మూడు వికెట్లు చేజార్చుకుంది. కుల్దీప్ యాదవ్ (5), ధ్రువ్ జురేల్(2), రిషబ్ పంత్(13) స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు.
మరో ఎండ్‌లో సాయి సుదర్శన్ మాత్రం క్రీజులో పాతుకు పోయాడు. 2 పరుగులతో చివరి రోజు ఆట మొదలు పెట్టిన ఈ ఎడంచేతి వాటం బ్యాటర్ ఆత్మరక్షణ ధోరణిలో సఫారీ బౌలర్లను ఎదుర్కొన్నాడు. పరుగులు రాబట్టకపోయినా వికెట్ కాపాడుకునేందుకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఈ క్రమంలో ఈ సిరీస్‌లో అత్యధిక బంతులు ఎదుర్కొన్న భారత బ్యాటర్‌గా నిలిచాడు. 139 బంతుల్లో ఒకే ఒక్క ఫోర్‌తో 14 పరుగులు మాత్రమే చేశాడు. దీన్ని బట్టే అర్థమవుతోంది సాయి ఎంత స్లోగా ఆడాడో. మ్యాచ్ ఎలాగూ ఓడిపోతాం కాబట్టి.. వికెట్లు పడకుండా ఉంటే డ్రా అవుతుందన్న ఉద్దేశంతో అతడు ఇలా బ్యాటింగ్ చేశాడని విశ్లేషకులు అంటున్నారు.
టీమిండియా చిత్తు
మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా 408 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో చిత్తుగా ఓడిపోయింది. రెండో 549 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన భారత్ 140 పరుగులకు ఆలౌటయింది. అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచిన రవీంద్ర జడేజా (Ravindra Jadeja) చివరి వికెట్‌గా వెనుదిరిగాడు. జడేజా 87 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 54 పరుగులు చేసి కేశవ మహరాజ్ బౌలింగ్‌లో అవుటయ్యాడు.


