అండర్ 19 ప్రపంచకప్-2026 సన్నాహకాల్లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న యూత్ వన్డే సిరీస్‌లో యువ భారత జట్టు అదరగొడుతోంది. తొలి వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత అండర్-19 జట్టు.. ఇప్పడు రెండో వన్డేలోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేసింది.
సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో టీమిండియా విజయం సాధించింది. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0తో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది.
సౌతాఫ్రికా బ్యాటర్లలో జేసన్ రౌల్స్ సెంచరీతో కదం తొక్కాడు. రౌల్స్ 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లతో ప్రోటీస్ పతనాన్ని శాసించాడు. అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు.
వైభవ్ మెరుపులు..
అనంతరం వర్షం కారణంగా భారత్ లక్ష్యాన్ని 27 ఓవర్లలో 174 పరుగులుగా కుదించారు. లక్ష్య చేధనలో కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. క్రీజులో ఉన్నంత సేపు బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 10 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేశాడు. ఆ తర్వాత అభిజ్ఞాన్ కుందు (48 ), వేదాంత్ త్రివేది (31) అజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. భారత జట్టు 23.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపడేసింది.
చదవండి: IND vs SA: వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే


