బెనోని వేదికగా సౌతాఫ్రికా అండర్-19తో జరుగుతున్న రెండో యూత్ వన్డేలో భారత్ అండర్ 19 కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించాడు. 246 పరుగుల స్వల్ప లక్ష్య చేధనలో వైభవ్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే సఫారీ బౌలర్లను ఉతికారేశాడు. ఈ యువ సంచలనం విల్లోమూర్ పార్క్ మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఈ క్రమంలో కేవలం 19 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా కేవలం 24 బంతులు మాత్రమే ఎదుర్కొన్న వైభవ్.. 10 సిక్స్‌లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి విధ్వంసం ధాటికి భారత్ స్కోర్ 10 ఓవర్లలోనే వంద పరుగుల మార్క్ దాటింది. టీమిండియా విజయానికి ఇంకా 115 పరుగులు కావాలి. అయితే వర్షం కారణంగా ఆట నిలిచిపోయింది.
ప్రస్తుతం క్రీజులో అభిజ్ఞాన్ కుండు(2), వేదాంత్ త్రివేది(9) ఉన్నారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.3 ఓవర్లలో 245 పరుగులకు ఆలౌటైంది. భారత యువ పేసర్ కిషన్ కుమార్ సింగ్ 4 వికెట్లతో సత్తాచాటాడు. అతడితో పాటు ఆర్ ఆర్ఎస్ అంబరీష్ రెండు, కన్షిక్, దీపేష్ తలా వికెట్ సాధించారు.
ప్రోటీస్ బ్యాటర్లలో జేసన్ రౌల్స్ సెంచరీ సాధించాడు. రౌల్స్ 113 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 114 పరుగులు చేశాడు. కాగా ఈ సిరీస్‌కు రెగ్యూలర్ కెప్టెన్ అయూష్ మాత్రే దూరం కావడంతో జట్టును వైభవ్ నడిపిస్తున్నాడు.
చదవండి: 129 ఫోర్లు, 59 సిక్సర్లు.. 1009 రన్స్ బాదిన ఆ ‘కుర్రాడు’ ఎక్కడ?
Vaibhav vikraal Suryavanshi pic.twitter.com/eqiMzYeYvI
— Anuj (@A1iconic) January 5, 2026


