జనవరి 5, 2016... పదేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు.. ముంబైలోకి కళ్యాణ్‌లో గల రెండు హౌజింగ్ సొసైటీల మధ్య ఉన్న అతి సాధారణ గ్రౌండ్. అప్పటికి వరకు దానికి పెద్దగా గుర్తింపు లేదు. ఎప్పటిలాగే ఆరోజు రెండు జట్లు పోటీపడుతున్నాయి. శ్రీమతి కేసీ గాంధీ స్కూల్ కోచ్ తమ వికెట్ కీపర్ బ్యాటర్‌ను ఓపెనర్‌గా పంపాలని నిర్ణయించుకున్నాడు.
ఏడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ పదే పదే వికెట్ పారేసుకుంటున్నాడనే ఉద్దేశంతో ఈసారి కాస్త ఓపికగా ఆడతాడేమో అన్న ఆశతో టాపార్డర్‌కు ప్రమోట్ చేశాడు. అయితే, ఆరోజు తాను చేసిన పని సరికొత్త చరిత్రను సృష్టించబోతుందని అతడికి తెలియదు.
ఆర్య గురుకుల్ స్కూల్‌తో మ్యాచ్‌లో ఆ వికెట్ కీపర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. సీనియర్లంతా పదో తరగతి పరీక్షలతో బిజీగా ఉన్న సమయంలో జూనియర్లతో జరిగిన నాటి మ్యాచ్‌లో అతడు ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. తొలిరోజు సున్నాతో స్కోరు మొదలుపెట్టిన అతడు.. ఆనాటి ఆట ముగిసే సరికి ఏకంగా 652 పరుగులతో క్రీజులో నిలిచాడు.
తన భారీ ఇన్నింగ్స్‌తో 117 ఏళ్లుగా టెస్టు క్రికెట్‌లో చెక్కు చెదరకుండా ఉన్న ఆల్‌టైమ్ రికార్డును ఆ పదిహేనేళ్ల క్రికెటర్ బద్దలుకొట్టాడు. అర్థుర్ కొలిన్స్ 1899లో 628 పరుగులు చేసి రికార్డు సృష్టించగా.. దానిని సదరు ప్లేయర్ బ్రేక్ చేశాడు. అయితే, రెండో రోజు ఆటలోనే ఊహకందని విధంగా అతడి విధ్వంసం కొనసాగింది.
327 బంతుల్లో ఏకంగా 1009 పరుగులు
ఓవర్‌నైట్ స్కోరుకు 450కి పైగా పరుగులు చేసిన ఆ కుర్రాడు.. ఓవరాల్‌గా 327 బంతుల్లో ఏకంగా 1009 పరుగులు సాధించాడు. తద్వారా ఒకే ఇన్నింగ్స్‌లో అత్యధిక వ్యక్తిగత, అతిభారీ స్కోరు సాధించిన క్రికెటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. దీంతో ఒక్కసారి అతడి పేరు మారుమ్రోగిపోయింది.
టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండుల్కర్ నుంచి మహేంద్ర సింగ్ ధోని దాకా ప్రతి ఒక్కరు అతడి ప్రతిభను కొనియాడారు. బీబీసీ సైతం అతడి ఇంటర్వ్యూ తీసుకుంది. ఓ సాధారణ ఆటో డ్రైవర్ కుమారుడైన ఆ క్రికెటర్ పేరు ప్రణవ్ ధన్వాడే. ఏకంగా ఏడు గంటల.. ఇరవై ఏడు నిమిషాలు క్రీజులో ఉండి వెయ్యికి పైగా పరుగులు చేసి చరిత్ర పుటల్లో తన పేరును స్వర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు.

ఆనాటి మ్యాచ్‌లో ప్రణవ్ జట్టు మూడు వికెట్ల నష్టానికి 1465 పరుగుల అసాధారణ స్కోరు వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా.. ప్రత్యర్థి జట్టు రెండు ఇన్నింగ్స్‌లో వరుస 31, 52 పరుగులకు ఆలౌట్ అయింది. ఫలితంగా ప్రణవ్ జట్టు 1382 పరుగుల తేడాతో అతి భారీ విజయం సాధించింది.
ప్రణవ్ ధన్వాడే ఇప్పుడు ఎక్కడ?
అలా ఓవర్‌నైట్ స్టార్ అయిపోయిన ప్రణవ్ ధన్వాడే.. ఆ తర్వాత మాయమైపోయాడు. ఫామ్‌లేమితో సతమతమవుతూ వరుసగా విఫలమయ్యాడు. ఒక్కసారిగా వచ్చిన ఫేమ్‌తో ఒత్తిడికి లోనై ఆటపై దృష్టి పెట్టలేకపోయాడు.
ఈ క్రమంలో ముంబై అండర్-19 జట్టుకు ఎంపిక కావడమే గగనంగా మారింది. ఆ తర్వాత కరోనా దెబ్బకు అండర్-23 సెలక్షన్స్ ట్రయల్స్‌కు వెళ్లలేకపోయాడు. ప్రణవ్ సమకాలీన ఆటగాళ్లు ఐపీఎల్‌లో కోట్ల రూపాయలు కొల్లగొడుతుంటే.. క్రమక్రమంగా అతడి పేరు మాత్రం కనుమరుగైపోయింది. పాతికేళ్ల ప్రణవ్ ధన్వాడేకు మంచిరోజులు రావాలని ఆశిద్దాం!!


