భారత టెస్టు జట్టు సారథిగా అరంగేట్రంలోనే ఇంగ్లండ్ పర్యటన రూపంలో కఠిన సవాలు ఎదుర్కొన్నాడు శుబ్‌మన్ గిల్. అయితే, ఇంగ్లండ్ గడ్డపై బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసి.. పాస్ మార్కులు వేయించుకున్నాడు. అనంతరం వెస్టిండీస్‌తో స్వదేశంలో 2-0తో వైట్‌వాష్ చేసి సత్తా చాటాడు.
అయితే, ఇటీవల సౌతాఫ్రికాతో టెస్టు (IND vs SA) సిరీస్‌లో మాత్రం గిల్ సేన ఘోర పరాభవం చవిచూసింది. సఫారీల చేతిలో 2-0తో వైట్‌వాష్‌కు గురైంది. తద్వారా పాతికేళ్ల తర్వాత తొలిసారి ప్రొటిస్ జట్టు క్లీన్‌స్వీప్ విజయంతో సత్తా చాటగా.. టీమిండియాకు చేదు అనుభవం మిగిలింది.
గిల్ డిమాండ్ ఇదే
ఈ పరిణామాల నేపథ్యంలో కెప్టెన్ గిల్ (Shubman Gill).. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పెద్దల ముందుకు ఓ విజ్ఞప్తి తీసుకువచ్చినట్లు సమాచారం. టెస్టు సిరీస్ ఆరంభానికి పదిహేను రోజుల ముందు నుంచే సన్నాహకాలు మొదలుపెట్టేలా ప్రణాళికలు రచించాలని యాజమాన్యాన్ని గిల్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘టెస్టు సిరీస్ ఆడేందుకు ముందు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావడం అత్యంత ముఖ్యమని గిల్ భావిస్తున్నాడు. మ్యాచ్‌లు ఆడటానికి కనీసం పదిహేను రోజుల ముందు నుంచే ప్రాక్టీస్ మొదలుపెడితే బాగుంటుందని అతడి ఆలోచన.
దీని గురించి గిల్ ఇప్పటికే బోర్డు ముందు ప్రతిపాదన తెచ్చాడు. జట్టును ఎలా ముందుకు నడిపించాలన్న అంశంపై అతడికి పూర్తి అవగాహన ఉంది. సెలక్టర్లు, బీసీసీఐ పెద్దలతో తన డిమాండ్ల గురించి చెప్పాడు.
టెస్టులతో పాటు వన్డేల్లోనూ రోహిత్ శర్మ తర్వాత గొప్ప సారథిగా ఎదిగేందుకు అన్ని అర్హతలు గిల్‌కు ఉన్నాయి. తన ఆలోచనలను నిక్కచ్చిగా పంచుకుంటూ జట్టును మరింత గొప్పగా అభివృద్ధి చేయాలని యోచిస్తున్నాడు’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.
విరామం లేని షెడ్యూల్
కాగా దుబాయ్‌లో ఆసియా కప్-2025 గెలిచిన టీమిండియా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే వెస్టిండీస్‌తో టెస్టు బరిలో దిగింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటన ముగించుకున్న ఆరు రోజుల తర్వాత సొంతగడ్డపై ప్రొటిస్‌తో టెస్టుల్లో తలపడి.. పూర్తిస్థాయి ప్రాక్టీస్ లేకుండా వైట్‌వాష్ రూపంలో భారీ మూల్యమే చెల్లించింది.
ఇక గిల్ ఈ మేరకు ఆలోచన చేసిన నేపథ్యంలో బీసీసీఐ ఇందుకు సంబంధించి కీలక ముందడుగు వేయనున్నట్లు తెలుస్తోంది. ‘‘హెడ్‌కోచ్ గౌతం గంభీర్ వన్డే, టీ20 సిరీస్‌లతో బిజీగా ఉంటాడు కాబట్టి.. టెస్టు సిరీస్‌లకు సన్నద్ధమయ్యే క్రమంలో బోర్డు వీవీఎస్ లక్ష్మణ్ సేవలను వాడుకోవాలని భావిస్తోంది. అతడి ఆధ్వర్యంలో రెడ్‌బాల్ క్యాంపులను నిర్వహించే అవకాశం ఉంది’’ అని బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఇదిలా ఉంటే.. స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు, ఐదు టీ20 సిరీస్‌లతో టీమిండియా బిజీ కానుంది. అనంతరం టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో పాల్గొంటుంది. ఈ మెగా ఈవెంట్ ఆడే జట్టులో గిల్‌కు చోటు దక్కలేదు.
చదవండి: జో రూట్ 41వ శతకం


