ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జో రూట్ టెస్ట్ క్రికెట్‌లో మరో శతకం సాధించాడు. ఇది అతనికి 41వ శతకం. ఓవరాల్‌గా (మూడు ఫార్మాట్లలో కలిపి) 60వ శతకం. ఈ సెంచరీతో రూట్ టెస్ట్‌ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రికీ పాంటింగ్‌తో కలిసి మూడో స్థానంలో ఉన్నాడు. పాంటింగ్, రూట్ చెరో 41 సెంచరీలు చేశారు. ఈ జాబితాలో సచిన్ (51), సంగక్కర (45) పాంటింగ్, రూట్ కంటే ముందున్నారు.
ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న అంతర్జాతీయ క్రికెటర్లలో మూడు ఫార్మాట్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రూట్ రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ (84) ఒక్కడే రూట్ కంటే ముందున్నాడు. గత ఆరేళ్లలో రూట్‌కు ఇది 24 శతకం. ఇంత తక్కువ వ్యవధిలో ఓ ఆటగాడు ఇన్ని శతకాలు చేయడమనేది ఆషామాషీ విషయం కాదు.

తాజా శతకంతో రూట్ తన సమకాలీకులు, ఫాబ్-4లో మిగతా ముగ్గురి కంటే మరింత ఎత్తుకు ఎదిగాడు. రూట్ ఖాతాలో 41 సెంచరీలు ఉండగా.. స్టీవ్ స్మిత్ 36, కేన్ విలియమ్సన్ 33, విరాట్ కోహ్లి 30 సెంచరీలు కలిగి ఉన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ సిరీస్ చివరి టెస్ట్‌లో రూట్ తన 41వ శతకాన్ని సాధించాడు. ఈ సిరీస్‌కు ముందు రూట్‌కు ఆసీస్ గడ్డపై ఒక్క సెంచరీ కూడా లేదు. ఇదే సిరీస్‌లోనే ఆసీస్ గడ్డపై తన తొలి సెంచరీ చేశాడు. తాజాగా ఆ సంఖ్యను రెండుకు పెంచుకున్నాడు. ఈ సిరీస్‌లో రూట్ 9 ఇన్నింగ్స్‌ల్లో 2 సెంచరీల సాయంతో 394 పరుగులు చేశాడు.
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ (15921) కొనసాగుతుండగా.. అతనికి రూట్‌కు (13937) వ్యత్యాసం ఇంకా 1984 పరుగులు మాత్రమే.

సిడ్నీ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 242 బంతులు ఎదుర్కొన్న రూట్ 15 బౌండరీల సాయంతో 160 పరుగులు చేసి ఔటయ్యాడు. రూట్ సెంచరీతో కదంతొక్కడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) సెంచరీకి చేరువలో ఔట్ కాగా.. జేమీ స్మిత్ (46) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆసీస్ మూడో సెషన్ సమయానికి వికెట నష్టపోకుండా 44 పరుగులు చేసింది. హెడ్ 24, వెదరాల్డ్ 19 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఆసీస్ ఇంకా 340 పరుగులు వెనుకపడి ఉంది. కాగా, 5 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇప్పటికే 3-1 తేడాతో కైవసం చేసుకుంది.


