భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే ఆదివారం (జనవరి 11) జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు టీమిండియాకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ ప్రాక్టీస్ సెషన్‌లో గాయపడ్డాడు. మొదటి వన్డే కోసం భారత జట్టు వడోదరలోని బీసీఏ (BCA) స్టేడియంలో శనివారం తమ చివరి ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గోంది.
అయితే త్రోడౌన్ స్పెషలిస్టుల ఎదుర్కొంటున్న సమయంలో ఓ బంతి పంత్ నడుము పైభాగంలో బలంగా తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిలాడాడు. వెంటనే జట్టు ఫిజియో పరిగెత్తుకుంటూ వచ్చి అతడికి చికిత్స అందించాడు. అయినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో రిషబ్ ప్రాక్టీస్ మధ్యలోనే మైదానాన్ని వీడాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పంత్ గాయపడిన సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అక్కడే ఉన్నాడు. కాగా విజయ్ హజారే ట్రోఫీలో బిజీబీజీగా గడిపిన పంత్ శుక్రవారం భారత జట్టుతో చేరాడు. అంతలోనే పంత్ గాయపడడం టీమ్ మెనెజ్‌మెంట్‌ను కలవరపెడుతోంది.
అయితే పంత్ గాయంపై బీసీసీఐ ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పంత్ ప్రస్తుతం జట్టులో కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా ఉన్నాడు. సౌతాఫ్రికాతో జరిగిన వన్డే సిరీస్ మొత్తానికి అతడు బెంచ్‌కే పరిమితమయ్యాడు. కివీస్‌తో వన్డే సిరీస్‌కు పంత్‌ను పక్కన పెట్టనున్నట్లు వార్తలు వచ్చాయి. అతడి స్ధానంలో ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సెలెక్టర్లు మాత్రం పంత్ వైపే మొగ్గు చూపారు.
కివీస్‌తో వన్డేలకు భారత జట్టు
శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్ (వైస్-కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, నితీష్ కుమార్ రెడ్డి, రిషబ్ పంత్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కెఎల్ రాహుల్, రోహిత్ శర్మ, వాషింగ్టన్ సుందర్.
చదవండి: WPL 2026: అరంగేట్రంలోనే అదరగొట్టిన అనుష్క శర్మ


