టీమిండియా తాత్కాలిక కెప్టెన్ పంత్‌తో బవుమా
సౌతాఫ్రికా కెప్టెన్‌గా తెంబా బవుమా (Temba Bavuma) మరో చారిత్రాత్మక విజయం అందుకున్నాడు. పాతికేళ్ల తర్వాత టీమిండియాను సొంతగడ్డపై టెస్టుల్లో వైట్‌వాష్ చేసిన ప్రొటిస్ సారథిగా నిలిచాడు. ఇప్పటికే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 టైటిల్ గెలిచిన బవుమాకు.. భారత పర్యటన రూపంలో ఈ మేరకు మరో అపురూపమైన విజయం దక్కింది.
సాష్టాంగపడేలా చేస్తాం
గువాహటి వేదికగా రెండో టెస్టులో టీమిండియాను 408 పరుగుల తేడాతో చిత్తు చేసిన తర్వాత సౌతాఫ్రికా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే, అంతకంటే ముందు.. అంటే మంగళవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా సౌతాఫ్రికా హెడ్‌కోచ్ షుక్రి కాన్రాడ్ టీమిండియాను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు.
తాము ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. ఆఖరి రోజు టీమిండియాను సాష్టాంగపడేలా చేస్తామన్న అర్థంలో కాన్రాడ్ మాట్లాడాడు. అతడి వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో దుమారం రేగింది. ఈ విషయంపై భారత దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble), సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ (Dale Steyn) హుందాగా ఉండాలంటూ అతడికి హితవు పలికారు.
కోచ్ కామెంట్స్‌పై బవుమా స్పందన ఇదే
ఈ నేపథ్యంలో భారీ విజయం తర్వాత మీడియాతో మాట్లాడిన బవుమాకు.. సౌతాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ వ్యాఖ్యల గురించి ప్రశ్న ఎదురైంది. ఇందుకు స్పందిస్తూ.. ‘‘మా కోచ్ మాట్లాడిన మాటల గురించి నాకు ఈరోజు ఉదయమే తెలిసింది. నా దృష్టి మొత్తం మ్యాచ్ మీదే కేంద్రీకృతమై ఉంది. అందుకే పెద్దగా పట్టించుకోలేదు.
అసలు ఆయనతో మాట్లాడే తీరికే దొరకలేదు. షుక్రి అరవై ఏళ్ల వయసుకు దగ్గరపడ్డారు. ఆయన తన వ్యాఖ్యలను పునః సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది’’ అని బవుమా విమర్శించాడు.
హద్దు మీరి ప్రవర్తించారు
అదే సమయంలో తనపై టీమిండియా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా చేసిన వ్యాఖ్యలను కూడా బవుమా ఈ సందర్భంగా ప్రస్తావించాడు. ‘‘అయినా.. ఈ సిరీస్‌లో మా కోచ్ ఒక్కరే కాదు.. చాలా మంది ఆటగాళ్లు కూడా హద్దు మీరి ప్రవర్తించారు. అయితే, మా కోచ్ లైన్ క్రాస్ చేశారని నేను అనడం లేదు. కానీ ఆయన తన వ్యాఖ్యల గురించి మరోసారి ఆలోచించుకోవాలి’’ అని పేర్కొన్నాడు.
కాగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా బవుమా షాట్ గురించి రివ్యూ తీసుకునే విషయంలో బుమ్రా అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ‘అతడు మరుగుజ్జు’ కదా అంటూ బవుమాను హేళన చేశాడు. ఇక కోల్‌కతాలో భారత్‌పై 30 పరుగుల తేడాతో గెలుపొందిన సౌతాఫ్రికా.. గువాహటిలో 408 పరుగుల తేడాతో టీమిండియాను చిత్తుగా ఓడించింది.
చదవండి: ఇండియా టెస్ట్ క్రికెట్ చచ్చిపోయింది.. ఫ్యాన్స్ ఫైర్


