లిస్ట్-ఏ ఫార్మాట్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అరివీర భయంకరమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. గత 7 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు, 4 హాఫ్ సెంచరీలతో తిరుగులేని ప్రదర్శనలు చేస్తున్నాడు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (జనవరి 11) జరిగిన తొలి వన్డేలో తృటిలో సెంచరీ (93) అవకాశాన్ని కోల్పోయాడు.
విరాట్ సత్తా చాటడంతో న్యూజిలాండ్‌పై భారత్ 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ ప్రదర్శనగానూ విరాట్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా దక్కింది. ఈ ఇన్నింగ్స్‌తో విరాట్ పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతం విరాట్‌కు ముందు సచిన్ మాత్రమే ఉన్నాడు. అలాగే అంతర్జాతీయ క్రికెట్‌లో వేగంగా 28000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగానూ విరాట్ రికార్డుల్లోకెక్కాడు.
ఇదిలా ఉంటే, తొలి వన్డే అనంతరం విరాట్ సోదరుడు వికాస్ కోహ్లి సోషల్‌మీడియాలో షేర్ చేసిన ఓ సందేశం వైరలవుతుంది. విరాట్‌పై ఇటీవల చులకన వ్యాఖ్యలు చేసిన భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు వికాస్ పరోక్షంగా చురకలించాడు.
విరాట్ టెస్ట్‌ల నుంచి తప్పుకొని, కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగడంపై మంజ్రేకర్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. వన్డేలు టాపార్డర్ బ్యాటర్లకు సులభమైన ఫార్మాట్ అని వ్యాఖ్యానించాడు. జో రూట్, స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్‌లను ఉదాహరణగా చూపిస్తూ, వారు టెస్ట్‌ల్లో గొప్ప వారసత్వాన్ని నిర్మిస్తున్నారంటూ విరాట్‌ను నేరుగా టార్గెట్ చేశాడు.
ఈ వ్యాఖ్యలకు కౌంటర్‌గానే వికాస్ సోదరుడు విరాట్ తరఫున రంగంలోకి దిగాడు. మంజ్రేకర్ పేరు ప్రస్తావించకుండానే “ఇది ఎంత సులభమైన ఫార్మాట్ కదా... కొద్ది రోజుల క్రితం ఎవరో తమ జ్ఞానాన్ని పంచుకున్నారు.. చెప్పడం సులభం, చేయడం కష్టం” అంటూ ఓ మెసేజ్ షేర్ చేశాడు.
ఈ సందేశాన్ని అభిమానులు మాజీ క్రికెటర్–కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా భావిస్తున్నారు. కాగా, విరాట్‌పై ఈగ కూడా వాలనివ్వని వికాస్ గతంలో కూడా చాలా సందర్భాల్లో విరాట్‌పై వ్యతిరేక కామెంట్లు చేసే వారికి ఇలాగే చురకలంటించాడు. విరాట్ జనవరి 14న న్యూజిలాండ్‌తో జరిగే రెండో వన్డేలో తిరిగి బరిలోకి దిగుతాడు. ఈ మ్యాచ్ రాజ్ కోట్ వేదికగా జరుగనుంది.


