టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్‌లో బంగ్లాదేశ్ ఆడే వేదికల మార్పు అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) స్పందించింది. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) నుంచి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని స్పష్టం చేసింది. కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో భారత్‌తో దౌత్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే.
భద్రత విషయంలో..
ఈ క్రమంలో ఐపీఎల్ నుంచి బంగ్లాదేశ్ ఫాస్ట్‌బౌలర్ ముస్తాఫిజుర్ రహమాన్ (Mustafizur Rahman)ను బీసీసీఐ తొలగించిది. ఈ నేపథ్యంలో తమ ఆటగాళ్ల భద్రత దృష్ట్యా భారత్‌లో తాము టీ20 వరల్డ్‌కప్ మ్యాచ్‌లు ఆడబోమంటూ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) పంతానికి పోయింది. తమ జట్టు ఆడే వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాల్సిందిగా ఐసీసీకి విజ్ఞప్తి చేసింది.
అయితే, టోర్నీ ఆరంభానికి కొద్ది రోజుల (ఫిబ్రవరి 7) సమయమే ఉన్నందున ఐసీసీ ఇందుకు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ వేదికలను కోల్‌కతా, ముంబై నుంచి చెన్నై, తిరునవంతపురానికి మార్చినట్లు సోమవారం వార్తలు వచ్చాయి.
స్పందించిన బీసీసీఐ
ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్వయంగా స్పందించారు. IANSతో మాట్లాడుతూ.. ‘‘బంగ్లాదేశ్ మ్యాచ్‌ల వేదికలను చెన్నై లేదంటే మరో చోటికి మార్చాలంటూ ఐసీసీ నుంచి బీసీసీఐకి ఎలాంటి సందేశమూ రాలేదు. అయినా ఈ విషయం మా ఆధీనంలో లేదు.
బీసీబీ, ఐసీసీ మధ్య వ్యవహారం ఇది. ఐసీసీ పాలక మండలికే అన్ని అధికారాలు ఉంటాయి. ఒకవేళ వేదికలను మార్చాలని గనుక ఐసీసీ ఆదేశిస్తే.. ఆతిథ్య దేశంగా అందుకు తగ్గట్లుగా చర్యలు చేపడతాము. ఇప్పటికైతే ఈ అంశంలో మాకు ఎలాంటి సమాచారమూ లేదు’’ అని దేవజిత్ సైకియా స్పష్టం చేశారు.
టీ20 ప్రపంచకప్-2026లో బంగ్లాదేశ్ షెడ్యూల్
ఫిబ్రవరి 7- వెస్టిండీస్‌తో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా
ఫిబ్రవరి 9- ఇటలీతో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా
ఫిబ్రవరి 14- ఇంగ్లండ్‌తో- కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా
ఫిబ్రవరి 17- నేపాల్‌తో- ముంబైలోని వాంఖడే వేదికగా.
చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్.. జట్టులోకి ఊహించని ఆటగాడు


