ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్‌ కోహ్లి | I send my awards to my mum She: Virat Kohli Reveals Reason | Sakshi
Sakshi News home page

ఈ అవార్డులన్నీ ఆమెకే.. అమ్మకు ఇష్టం: విరాట్‌ కోహ్లి

Jan 12 2026 2:45 PM | Updated on Jan 12 2026 3:27 PM

I send my awards to my mum She: Virat Kohli Reveals Reason

విరాట్‌ కోహ్లి (PC: BCCI)

వన్డే క్రికెట్‌లో తాను ఛేజింగ్‌ ‘కింగ్‌’నని టీమిండియా దిగ్గజం విరాట్‌ కోహ్లి మరోసారి నిరూపించుకున్నాడు. సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తూ న్యూజిలాండ్‌తో తొలి వన్డేలోనూ అదరగొట్టాడు. తృటిలో సెంచరీ చేజార్చుకున్నా జట్టును గెలిపించి.. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’(POTM)గా నిలిచాడు. కాగా కోహ్లి కెరీర్‌లో ఈ అవార్డు అందుకోవడం ఇది 45వ సారి కావడం విశేషం.

మా అమ్మకు పంపిస్తాను
ఈ నేపథ్యంలో కోహ్లి (Virat Kohli) మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ‘‘నిజం చెప్పాలంటే నా కెరీర్‌లో ఈ అవార్డు అందుకోవడం ఎన్నోసారో ఐడియా కూడా లేదు. నాకు దక్కిన ట్రోఫీలన్నీ మా అమ్మకు పంపిస్తాను.

గుర్గావ్‌లోని మా ఇంట్లో ఈ ట్రోఫీలను ఉంచి.. వాటిని చూస్తూ మురిసిపోవడం అమ్మకు అత్యంత ఇష్టమైన పని. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. నా ప్రయాణం ఇంత గొప్పగా సాగడం నిజంగా ఓ కలలా ఉంది.

దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు
నా శక్తిసామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. అయితే, కఠినంగా శ్రమించినిదే ఏదీ లభించదని నాకు తెలుసు. ఆ దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు. నిజం చెప్పాలంటే.. మైలురాళ్ల గురించి నేను ఆలోచించడం లేదు. తొలుత బ్యాటింగ్‌ చేస్తే నాకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది.

ఛేదనలో లక్ష్యం ఎంతో తెలుసు కాబట్టి సులువుగా ముందుకు సాగిపోతూ ఉంటాను’’ అని కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా భారత్‌- కివీస్‌ వడోదర వేదికగా ఆదివారం తొలి మ్యాచ్‌ ఆడాయి.

 93 పరుగులు
టాస్‌ గెలిచిన టీమిండియా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. న్యూజిలాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ అర్ధ శతకం (56)తో రాణించగా.. కోహ్లి నిలకడగా ఆడుతూ 91 బంతుల్లో 93 పరుగులు సాధించాడు. తృటిలో వన్డేల్లో 54వ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.

మిగిలిన వారిలో శ్రేయస్‌ అయ్యర్‌ (49) మెరుగ్గా ఆడగా.. 49 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి టీమిండియా.. నాలుగు వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. ఇక ఈ మ్యాచ్‌ సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్‌లో అతి తక్కువ (624) ఇన్నింగ్స్‌లోనే 28 వేల పరుగుల మైలురాయిని తాకిన క్రికెటర్‌గా కోహ్లి ప్రపంచ రికార్డు సాధించాడు.

చదవండి: క్రికెట్‌ చరిత్రలో అద్భుతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement