క్రికెట్ చరిత్రలో అద్భుతం జరిగింది. తండ్రి-కొడుకులు ఒకే జట్టులో కలిసి ఆడి చరిత్ర సృష్టించారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ 2025-26లో ఈ చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. ఆఫ్ఘనిస్తాన్ వెటరన్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ, అతని కొడుకు హసన్ ఐసాఖిల్ నోఖాలి ఎక్స్‌ప్రెస్ అనే ఫ్రాంచైజీకి కలిసి ప్రాతినిథ్యం వహించారు.
క్రికెట్ చరిత్రలో ఇలాంటి సందర్భాలు చాలా అరుదుగా ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో గతేడాదే తొలిసారి ఓ తండ్రి-కొడుకుల జోడీ (సుహైల్ సత్తార్ (50)-యాహ్యా సుహైల్ (17), తిమోర్-లెస్టే అనే దేశం తరఫున కలిసి టీ20 మ్యాచ్ ఆడింది.
విండీస్ దిగ్గజ బ్యాటర్ శివ్‌నరైన్ చంద్రపాల్ సైతం తన కొడుకు తేజ్‌నరైన్ చంద్రపాల్‌తో కలిసి ఓ క్లబ్ మ్యాచ్ ఆడాడు. తాజాగా మొహమ్మద్ నబీ-హసన్ ఐసాఖిల్ కలిసి ఓ టీ20 లీగ్ మ్యాచ్ ఆడి అత్యంత అరుదైన జాబితాలో చోటు దక్కించకున్నారు.
ప్రస్తుతం నబీ వయసు 41 సంవత్సరాలు కాగా.. హసన్ వయసు 19. 2007లో నబీ అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టినప్పుడు హసన్ 11 నెలల పసికందు. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత, ఈ తండ్రి–కొడుకు ఒకే జట్టులో ఆడటం చారిత్రక ఘట్టంగా నిలిచింది.
నబీ కెరీర్ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ చరిత్రలో ఇతనో దిగ్గజం. ప్రపంచ క్రికెట్‌లోనూ మేటి స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్. ఆఫ్ఘనిస్తాన్ తరఫున సుదీర్ఘ అనుభవం కలిగిన నబీకి కొడుకు హసన్‌తో కలిసి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని కల ఉంది. ఈ కల త్వరలోనే నెరవేరే అవకాశం ఉంది.
హసన్ ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్–ఏ క్రికెట్‌లో నిలకడగా రాణిస్తూ జాతీయ జట్టు అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడు. ఓపెనింగ్ బ్యాటర్ అయిన హసన్ పై రెండు ఫార్మాట్లలో సగటు 50కు చేరువగా పరుగులు సాధించాడు. పొట్టి క్రికెట్‌లో మాత్రం హసన్‌కు అనుభవం కాస్త తక్కువగా ఉంది. ఇప్పటివరకు 30 మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు.
బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ హసన్‌కు తొలి విదేశీ అసైన్‌మెంట్. నోఖాలి ఎక్స్‌ప్రెస్ తరఫున మూడు వారాల పాటు బెంచ్‌లో కూర్చున్న హసన్.. తాజాగా ఢాకా క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌తో బీపీఎల్ అరంగేట్రం చేశాడు.
అరంగేట్రంలోనే విధ్వంసం
అరంగేట్రంలోనే హసన్ చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లు సాయంతో 92 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. కేవలం 8 పరుగులతో సెంచరీ చేసే సుదర్ణావకాశాన్ని కోల్పోయాడు. కొడుకు చెలరేగిపోగా, తండి నబీ మాత్రం 17 పరుగులు (2 ఫోర్లు) మాత్రమే చేసి నిరాశపరిచాడు.
అయితే నబీ బౌలింగ్‌లో సత్తా చాటి 4 ఓవర్లలో 23 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. తండ్రి-కొడుకులు సత్తా చాటడంతో ఈ మ్యాచ్‌లో ఢాకా క్యాపిటల్స్‌పై నోఖాలి ఎక్స్‌ప్రెస్ 41 పరుగుల తేడాతో గెలుపొందింది. అరంగేట్రంలోనే విధ్వంసం సృష్టించిన హసన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


