ఇంగ్లండ్ యువ క్రికెటర్ జేకబ్ బెతెల్ అత్యంత అరుదైన రికార్డు సాధించాడు. కెరీర్‌లో సాధించిన తొలి టెస్టు సెంచరీతోనే చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ సరసన చేరాడు.
యాషెస్ సిరీస్ 2025-26 (Ashes)లో భాగంగా ఇంగ్లండ్ క్రికెట్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఆతిథ్య ఆసీస్ తొలి మూడు టెస్టులు గెలిచి సిరీస్ సొంతం చేసుకోగా.. నాలుగో మ్యాచ్‌లో గెలవడంతో ఇంగ్లండ్‌కు ఊరట లభించింది. ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య ఆదివారం ఆఖరిదైన ఐదో టెస్టు మొదలైంది.
సిడ్నీలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులకు ఆలౌట్ అయింది. ఇందుకు ఆసీస్ ధీటుగా బదులిచ్చింది. తమ మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 567 పరుగులు సాధించింది. ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లిష్ జట్టు.. బుధవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి ఎనిమిది వికెట్ల నష్టానికి 302 పరుగులు చేయగలిగింది.
జేకబ్ బెతెల్ సెంచరీతో
ఇందుకు ప్రధాన కారణం జేకబ్ బెతెల్ (Jacob Bethell) ఇన్నింగ్స్. వన్‌డౌన్‌లో వచ్చిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్ 232 బంతులు ఎదుర్కొని.. పదిహేను ఫోర్లు బాది 142 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన కెరీర్‌లో టెస్టుల్లో తొలి సెంచరీ బాదిన 22 ఏళ్ల బెతెల్ అరుదైన ఘనతలు సాధించాడు.
కపిల్ దేవ్ సరసన
కాగా బెతెల్ 2024లో సౌతాఫ్రికాతో వన్డేల్లో తొలి శతకం బాదాడు. తాజాగా యాషెస్‌లో భాగంగా ఆసీస్‌తో మ్యాచ్ సందర్భంగా టెస్టుల్లో మొదటిసారి శతక్కొట్టాడు. తద్వారా తన కెరీర్‌లో ఫస్ట్ క్లాస్, లిస్ట్-ఎ సెంచరీలను అంతర్జాతీయ క్రికెట్‌లోనే నమోదు చేశాడు. దేశీ క్రికెట్‌లో అతడి ఖాతాలో ఇంత వరకు ఒక్క సెంచరీ లేదన్న మాట.
ఈ జాబితాలో టీమిండియా లెజెండ్ కపిల్ దేవ్‌తో పాటు వెస్టిండీస్‌కు చెందిన మార్లన్ సామ్యూల్స్, బంగ్లాదేశ్ ప్లేయర్ మెహిదీ హసన్ మిరాజ్, ఐర్లాండ్ ఆటగాడు కర్టిస్ కాంఫర్ ఉన్నారు. ఈ అరుదైన జాబితాలో తాజాగా చేరిన జేకబ్ బెతెల్.. ఈ ఘనత సాధించి తొట్టతొలి ఇంగ్లండ్ ప్లేయర్‌గా నిలిచాడు. దాదాపు 149 ఏళ్ల చరిత్ర కలిగిన ఇంగ్లండ్ క్రికెట్ తరఫున ఈ రేర్ రికార్డు సాధించింది అతడే కావడం గమనార్హం.
చదవండి: చరిత్ర సృష్టించిన వైభవ్ సూర్యవంశీ.. వరల్డ్ రికార్డు


