భారత అండర్-19 స్టార్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి శతక్కొట్టాడు. సౌతాఫ్రికా అండర్-19 జట్టుతో బుధవారం నాటి మూడో యూత్ వన్డేలో ఈ ఓపెనింగ్ బ్యాటర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఇరవై నాలుగు బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న వైభవ్.. ఆ తర్వాత కూడా జోరు కొనసాగించాడు.
ప్రపంచ రికార్డు
కేవలం 63 బంతుల్లోనే వంద పరుగుల మార్కు అందుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. యూత్ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో అతి తక్కువ బంతుల్లోనే సెంచరీ చేసిన కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. కేవలం పద్నాలుగేళ్ల వయసులోనే ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఈ అరుదైన ఫీట్ అందుకున్నాడు.
127 పరుగులు
బెనోనీ వేదికగా ఈ మ్యాచ్‌లో మొత్తంగా 74 బంతులు ఎదుర్కొన్న వైభవ్ సూర్యవంశీ.. తొమ్మిది ఫోర్లు, పది సిక్స్‌లు బాది 127 పరుగులు సాధించాడు. టాండో సోని బౌలింగ్‌లో జేసన్ రోవెల్స్‌కు క్యాచ్ ఇవ్వడంతో వైభవ్ విధ్వంసకర శతక ఇన్నింగ్స్‌కు తెరపడింది. ఇక మరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ సైతం దుమ్ములేపాడు.
227 పరుగుల భాగస్వామ్యం
ఆరోన్‌తో కలిసి వైభవ్.. తొలి వికెట్‌కు ఏకంగా 227 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. మరోవైపు.. ఆరోన్ సైతం శతక్కొట్టాడు. 106 బంతుల్లో 16 ఫోర్లు బాది 118 పరుగులు సాధించి జేసన్ రోవెల్స్ బౌలింగ్‌లో నిష్క్రమించాడు.
మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ వేదాంత్ త్రివేది 34, అభిజ్ఞాన్ కుందు 21 పరుగులు చేయగా.. మొహమద్ ఎనాన్ 28, హెనిల్ పటేల్ 19 పరుగులతో అజేయంగా నిలిచారు. హర్‌వన్ష్ పంగాలియా (2), ఆర్‌ఎస్ అంబరిష్ (8), కనిష్క్ చౌహాన్ (10) విఫలమయ్యారు. ఫలితంగా భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 393 పరుగులు చేసింది.
కెప్టెన్‌గా మొదటిసారే..
కాగా ఆయుశ్ మాత్రే గైర్హాజరీలో సౌతాఫ్రికా పర్యటనలో వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా భారత జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణిస్తూ ఇప్పటికే తొలి రెండు యూత్ వన్డేల్లో గెలిచి.. సారథి హోదాలో తొలి సిరీస్‌ను సొంతం చేసుకున్నాడు వైభవ్. ఇరుజట్ల మధ్య బుధవారం నాటి నామమాత్రపు మ్యాచ్‌లోనూ భారత్ విజయం సాధించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
చదవండి: బంగ్లాదేశ్‌కు భారీ షాక్


