భారత్‌లో జరగనున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026లో తమ మ్యాచ్‌లను ఇతర దేశానికి మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) చేసిన అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. షెడ్యూల్, వేదికల్లో ఎలాంటి మార్పులు ఉండవని స్పష్టం చేసింది. భారత్‌లో ఆడకపోతే పాయింట్లు కోల్పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించింది. ఈ విషయాలను ఐసీసీ వర్చువల్ సమావేశం ద్వారా బీసీబీకి తెలియజేసినట్లు సమాచారం.
అసలేం జరిగిందంటే..?
ఐపీఎల్ 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది. తదనంతర పరిణామాల్లో బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడులు తీవ్రతరమయ్యాయి. కొన్ని రాజకీయ ప్రేరేపిత శక్తులు ఏకంగా ఆరుగురు హిందువులను కిరాతకంగా చంపేశాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదేశీ ప్లేయర్‌ను ఐపీఎల్‌లో ఆడించకూడదని భారత్‌లో నిరసనలు వెల్తువెత్తాయి. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగి ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ కాంట్రాక్ట్ నుంచి తొలగించాలని కేకేఆర్‌కు అల్టిమేటం జారీ చేసింది. తప్పేదేమీ లేక కేకేఆర్ ముస్తాఫిజుర్‌ను కాంట్రాక్ట్ నుంచి తొలిగించింది.
తమ దేశ ఆటగాడిని ఐపీఎల్ నుంచి తొలగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది. అలాగే తమ దేశానికి చెందిన అంపైర్లు భారత్‌లో జరిగే ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో పాల్గొనరని స్పష్టం చేసింది.
ప్రపంచకప్ మ్యాచ్‌ల వేదికల మార్పుకు ఐసీసీ ససేమిరా అంటున్న నేపథ్యంలో బీసీబీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని క్రికెట్ ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఒకవేళ బంగ్లాదేశ్ సాహసం చేసి భారత్‌లో మ్యాచ్‌లు ఆడకపోతే, ఆ దేశ క్రికెట్ భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది.


