భారత్–న్యూజిలాండ్ మధ్య వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఈ మ్యాచ్‌కు థర్డ్ అంపైర్‌గా బంగ్లాదేశ్‌కు చెందిన షరఫుద్దౌలా సైకత్ వ్యవహరించారు. భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సైకత్ టీమిండియా మ్యాచ్‌కు అంపైర్‌గా వ్యవహరించడం చర్చనీయాంశంగా మారింది.
టీ20 ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌లో జరుగబోయే మ్యాచ్‌లకు తమ అంపైర్లను పంపబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఇలా జరగడం ఆసక్తికర పరిణామం.
భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యం
బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై దాడుల నేపథ్యంలో బంగ్లా స్టార్ బౌలర్ ముస్తాఫిజుర్ రహ్మాన్‌ను ఐపీఎల్ నుంచి తొలగించారు. 2026 వేలంలో ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ రూ. 9.20 కోట్ల భారీ ధర వెచ్చించి సొంతం చేసుకుంది.
ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్ నుంచి తొలిగించడాన్ని అవమానంగా భావించిన బంగ్లాదేశ్ ప్రభుత్వం స్వదేశంలో ఐపీఎల్‌ను బ్యాన్ చేసింది. భారత్‌లో తాము ఆడాల్సిన టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరింది.
ఐసీసీ నుంచి సరైన స్పందన లేకపోవడంతో తమ దేశానికి చెందిన అంపైర్లను ప్రపంచకప్ విధుల నిమిత్తం భారత్‌కు పంపించబోమని నిర్ణయించింది. ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ భవితవ్యంపై మరికొద్ది రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ముందస్తు షెడ్యూల్ ప్రకారం ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు కోల్‌కతా, ముంబై నగరాల్లో జరగాల్సి ఉంది. అయితే బీసీబీ విన్నపాన్ని పరిశీలిస్తున్న ఐసీసీ వేదికలను చెన్నై, తిరువనంతపురంకు మార్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
బోణీ కొట్టిన టీమిండియా
తొలి వన్డేలో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డెవాన్ కాన్వే (56), హెన్రీ నికోల్స్ (62), డారిల్ మిచెల్ (84) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 300 పరుగులు చేసింది. భారత బౌలర్లలో సిరాజ్, హర్షిత్, ప్రసిద్ద్ కృష్ణ తలో 2 వికెట్లు, కుల్దీప్ ఓ వికెట్ తీశారు.
అనంతరం భారత్ విరాట్ కోహ్లి (91 బంతుల్లో 93; 8 ఫోర్లు, సిక్స్), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (56), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (49), ఆఖర్లో ఎల్ రాహుల్ (29 నాటౌట్) హర్షిత్ రాణా (29) రాణించడంతో 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. న్యూజిలాండ్ బౌలర్లలో జేమీసన్ 4, ఆదిత్య అశోక్, క్రిస్టియన్ క్లార్క్ తలో వికెట్ తీశారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే రాజ్‌కోట్ వేదికగా జనవరి 14న జరుగనుంది.


