సొంతగడ్డపై టీమిండియాకు ఘోర అవమానం జరిగింది. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో భారత జట్టు చేదు ఫలితం చవిచూసింది. గువాహటిలో సఫారీలు విధించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 140 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా 408 పరుగుల భారీ తేడాతో పరాభవాన్ని మూటగట్టుకుంది.
కాస్త నిరాశకు లోనయ్యాం
ఈ నేపథ్యంలో టీమిండియా తాత్కాలిక కెప్టెన్ రిషభ్ పంత్ (Rishabh Pant) ఓటమిపై స్పందించాడు. ‘‘కాస్త నిరాశకు లోనయ్యాం. జట్టుగా మేము సమిష్టిగా రాణించి ఉండాల్సింది. అదే మా ఓటమికి కారణమైంది. ఏదేమైనా ఈ విజయంలో ప్రత్యర్థికి క్రెడిట్ ఇవ్వకతప్పదు. ఈ ఓటమి నుంచి మేము చాలా పాఠాలు నేర్చుకోవాల్సి ఉంది.
సిరీస్ ఆరంభం నుంచే సౌతాఫ్రికా ఆధిపత్యం కనబరిచింది. మేము ఓడిపోయాం. ఇప్పటికైనా స్పష్టమైన ఆలోచనా విధానం, వ్యూహాలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో మాకిది గుణపాఠంగా నిలిచిపోతుంది.
భారీ మూల్యమే చెల్లించాము
ఏదేమైనా మేము ఇంకాస్త మెరుగ్గా ఆడాల్సింది. వాల్లు అద్భుతంగా ఆడి సిరీస్ గెలుచుకున్నారు. క్రికెట్‌లో జట్టుగా భాగస్వామ్యాలు నెలకొల్పడం ముఖ్యం. మా విషయంలో అది లోపించింది. అందుకే సిరీస్ రూపంలో భారీ మూల్యమే చెల్లించాము. ఇక ముందైనా సరైన ప్రణాళిక, వ్యూహాలతో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాం’’ అని పంత్ పేర్కొన్నాడు.
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా డిఫెండింగ్ చాంపియన్ సౌతాఫ్రికాతో సొంతగడ్డపై టీమిండియా రెండు మ్యాచ్‌లు ఆడింది. కోల్‌కతాలో తొలి టెస్టులో 30 పరుగుల స్వల్ప తేడాతో ఓడిన భారత్.. తొలిసారి టెస్టుకు ఆతిథ్యం ఇచ్చిన గువాహటిలో ఏకంగా 408 పరుగుల తేడాతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.
ఇరవై ఐదేళ్ల తర్వాత
ఫలితంగా ఇరవై ఐదేళ్ల తర్వాత సౌతాఫ్రికా తొలిసారి టెస్టుల్లో టీమిండియాను వైట్‌వాష్ చేసింది. అంతకు ముందు 2000 సంవత్సరంలో ఈ ఘనత సాధించింది.ఇక గువాహటిలో జరిగిన రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ గాయం వల్ల దూరం కాగా.. పంత్ పగ్గాలు చేపట్టాడు.
ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. ముఖ్యంగా పంత్ (7, 13) తీవ్రంగా నిరాశపరచగా.. ఆఖరి రోజైన బుధవారం నాటి ఆటలో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (54) ఒంటరి పోరాటం చేశాడు. మిగతా వారి నుంచి అతడికి కాస్తైనా సహకారం లభిస్తే మ్యాచ్‌ను డ్రా చేసుకోవచ్చనే ఆశలను ప్రొటిస్ బౌలర్లు అడియాసలు చేశారు.
ఇక సఫారీ స్పిన్నర్లలో సైమన్ హార్మర్ ఏకంగా ఆరు వికెట్లతో చెలరేగి భారత బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించగా.. కేశవ్ మహరాజ్ రెండు, సెనూరన్ ముత్తుస్వామి ఒక వికెట్ తీశారు. పేసర్ మార్కో యాన్సెన్ ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
కాగా యాన్సెన్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి భారత్‌ను 201 పరుగులకు ఆలౌట్ చేయడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. హార్మర్ (మొత్తంగా 17 వికెట్లు)కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.


