డిఫెన్స్‌ ఆఫీసర్‌ కాబోయి.. క్రికెటర్‌గా: టీమిండియా స్టార్‌ | RCB Star Jitesh Sharma Reveals About His Unplanned Journey, Says He Never Dreamed Of Cricket And Wanted To Be A Defense Officer | Sakshi
Sakshi News home page

డిఫెన్స్‌ ఆఫీసర్‌ కాబోయి.. క్రికెటర్‌గా: టీమిండియా స్టార్‌

Feb 27 2026 5:39 PM | Updated on Feb 27 2026 6:24 PM

 Cricket Was Never The Plan: RCB India Star About His Unplanned Journey

టీమిండియా స్టార్‌ జితేశ్‌ శర్మ ఆసక్తికర విషయం వెల్లడించాడు. అసలు తాను క్రికెటర్‌ కావాలని ఎప్పుడూ అనుకోలేదన్నాడు. ఊహించని రీతిలో తన ప్రయాణం అంతర్జాతీయ స్థాయి వరకు చేరిందన్నాడు.

భారత టీ20 జట్టులో
మహారాష్ట్రకు చెందిన జితేశ్‌ శర్మ (Jitesh Sharma) దేశీ క్రికెట్‌, ఐపీఎల్‌లో సత్తా చాటి టీమిండియాలోకి వచ్చాడు. నేపాల్‌తో మ్యాచ్‌ సందర్భంగా 2023లో అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు భారత్‌ తరఫున 16 టీ20 మ్యాచ్‌లు ఆడిన ఈ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌.. 162 పరుగులు చేశాడు.

చివరగా సౌతాఫ్రికా (IND vs SA)తో గతేడాది జరిగిన టీ20 సిరీస్‌లో టీమిండియాకు ఆడిన 32 ఏళ్ల జితేశ్‌ శర్మ.. టీ20 ప్రపంచకప్‌-2026 జట్టులో మాత్రం చోటు దక్కించుకోలేకపోయాడు. 

ఆర్సీబీ స్టార్‌
ఇక ఐపీఎల్‌లో గతేడాది రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన జితేశ్‌.. తొలిసారి ట్రోఫీ ముద్దాడిన జట్టులో సభ్యుడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ గైర్హాజరీలో పలు మ్యాచ్‌లకు సారథిగానూ జితేశ్‌ వ్యవహరించడం విశేషం.

డిఫెన్స్‌ ఆఫీసర్‌ కావాలని కలలు కనేవాడిని
ఇదిలా ఉంటే.. ఆర్సీబీ మాజీ స్టార్‌, సౌతాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ పాడ్‌కాస్ట్‌లో జితేశ్‌ శర్మ చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘‘నా కెరీర్‌లో క్రికెట్‌ అనే ప్రణాళికే అస్సలు లేదు. నేను ఎల్లప్పుడూ డిఫెన్స్‌ ఆఫీసర్‌ కావాలని కలలు కనేవాడిని. రక్షణ రంగంలో సేవలు అందించాలని కోరుకునేవాడిని.

మార్కుల కోసమే క్రికెట్‌లోకి
అది కుదరకపోతే ఆర్మీ లేదంటే ఎయిర్‌ ఫోర్స్‌లో చేరాలనుకున్నాను. ఇందుకోసం నిర్వహించే పరీక్షలో రాష్ట్రం తరఫున ఏదేని క్రీడలో రాణిస్తే అదనంగా 25 మార్కులు వేస్తారనే నిబంధన ఉండేది. అందుకే నేను పాఠశాల స్థాయిలో క్రికెట్‌ ఆడటం మొదలుపెట్టాను.

అప్పుడు వికెట్‌ కీపర్‌ కోటాలో నాకు అవకాశం వచ్చింది. అప్పుడే తొలిసారి గ్లోవ్స్‌ తొడుక్కున్నా. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. మా చిన్నప్పటి కోచ్‌ ప్రీతం గాంధీ నాలోని ప్రతిభను గుర్తించారు. ఆయనే నన్ను ప్రోత్సహించారు.

ఆ ఇద్దరిది కీలక పాత్ర
ఆ తర్వాత ఓసారి నేను దినేశ్‌ కార్తిక్‌ను కలిశాను. వీరిద్దరే నా క్రికెట్‌ ప్రయాణంలో కీలక పాత్ర పోషించారు. నేను మొండివాడిని. ఏదైనా సాధించాలని అనుకుంటే అందుకోసం ఎంత కష్టమైనా భరిస్తాను. అయితే, ఆ మొండితనమే ఒక్కోసారి నా బలహీనతగానూ మారుతుంది.

ఏదేమైనా ఆర్సీబీలో చేరకముందు నా ప్రతిభను అంతగా ఎవరూ నమ్మేవారు కాదు. అయితే, ఆర్సీబీ యాజమాన్యం మాత్రం నాపై నమ్మకం ఉంచి వరస అవకాశాలు ఇచ్చింది. అదే నా కెరీర్‌లో గొప్ప టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పగలను’’ అని జితేశ్‌ శర్మ ఆర్సీబీ పట్ల ప్రేమను చాటుకున్నాడు. 

చదవండి: అతడు ఎక్కడ బౌలింగ్‌ చేశాడో చూశారా?: భారత మాజీ కెప్టెన్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement