ఊహించిందే జరిగింది.. సౌతాఫ్రికాతో రెండో టెస్టులో టీమిండియా 408 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది. ఆటలో గెలుపోటములు సహజమే అయినా.. కనీస పోరాట పటిమ కూడా కనబరచకుండా ‘స్టార్’ బ్యాటర్లంతా పెవిలియన్‌కు వరుస కట్టడం భారత జట్టు అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా సొంతగడ్డపై ఇంతటి భారీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC) -2025 విజేత సౌతాఫ్రికా డబ్ల్యూటీసీ తాజా సైకిల్‌లో భాగంగా రెండు టెస్టులు ఆడేందుకు భారత్‌కు వచ్చింది. భారీ అంచనాల నడుమ ఇరుజట్ల మధ్య కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ప్రొటిస్ జట్టు 30 పరుగుల తేడాతో గెలిచింది.
అనంతరం భారత్- సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా శనివారం రెండో టెస్టు మొదలుకాగా.. టాస్ గెలిచిన సఫారీలు ఆది నుంచే ఆధిపత్యం కనబరిచారు. తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల భారీ స్కోరు సాధించిన ప్రొటిస్ జట్టు.. అనంతరం టీమిండియాను 201 పరుగులకే ఆలౌట్ చేసింది. పేసర్ మార్కో యాన్సెన్ ఆరు వికెట్లతో సత్తా చాటి.. సౌతాఫ్రికాకు 288 పరుగుల భారీ ఆధిక్యం లభించడంలో కీలక పాత్ర పోషించాడు.
ఆ తర్వాత టీమిండియాను ఫాలో ఆన్ ఆడించకుండా తామే మళ్లీ బ్యాటింగ్ చేసిన సఫారీలు.. నాలుగో రోజు ఆఖరి సెషన్ వరకు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయలేదు. నెమ్మదిగా ఆడుతూనే 78.3 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసిన తర్వాత ప్రొటిస్ జట్టు తమ ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. టీమిండియాకు 549 పరుగుల (288+260) భారీ లక్ష్యాన్ని విధించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ట్రిస్టన్ స్టబ్స్ (94) అద్భుత ఇన్నింగ్స్ ఆడగా.. టోనీ డి జోర్జీ (49) తృటిలో అర్ధ శతంక చేజార్చుకున్నాడు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియాకు ఆదిలోనే షాకులు తగిలాయి. ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (13)ను యాన్సెన్ వెనక్కి పంపగా.. కేఎల్ రాహుల్ (6)ను సైమన్ హార్మర్ అవుట్ చేశాడు. దీంతో మంగళవారం నాటి నాలుగోరోజు ఆట ముగిసే సరికి టీమిండియా రెండు వికెట్ల నష్టానికి కేవలం 27 పరుగులు చేసింది.
ఈ క్రమంలో 27/2 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం నాటి ఆఖరి రోజు ఆటను మొదలుపెట్టిన టీమిండియాకు సఫారీ స్పిన్నర్ సైమన్ హార్మర్ చుక్కలు చూపించాడు. నైట్ వాచ్‌మన్ కుల్దీప్ యాదవ్ (5)ను సైమన్ బౌల్డ్ చేయగా.. పట్టుదలగా క్రీజులో నిలబడ్డ సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14)ను సెనూరన్ ముత్తుస్వామి వెనక్కి పంపాడు.
ఆ తర్వాత సైమన్ హార్మర్ తన వికెట్ల వేటను వేగవంతం చేశాడు. ధ్రువ్ జురెల్ (2), కెప్టెన్ రిషభ్ పంత్ (13), వాషింగ్టన్ సుందర్ (16), నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేసి.. భారత బ్యాటింగ్ ఆర్డర్‌ను కుదేలు చేశాడు. ఇక పట్టుదలగా నిలబడ్డ రవీంద్ర జడేజా అర్ధ శతక వీరుడు (87 బంతుల్లో 54)ను వెనక్కి పంపిన మరో స్పిన్నర్ కేశవ్ మహరాజ్.. మొహమ్మద్ సిరాజ్ (0) ఆఖరి వికెట్‌గా వెనక్కి పంపి టీమిండియా ఓటమిని ఖరారు చేశాడు.
మొత్తంగా సైమన్ హార్మర్ ఆరు వికెట్లతో చెలరేగగా.. కేశవ్ మహరాజ్ రెండు, యాన్సెన్, ముత్తుస్వామి చెరో వికెట్ దక్కించుకున్నారు. ఇక సమిష్టి కృషితో ఆద్యంతం అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా పాతికేళ్ల తర్వాత తొలిసారి భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడమే కాదు..వైట్‌వాష్ చేసింది కూడా!!


