సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో టీమిండియా (IND vs SA Tests) ప్రదర్శన స్థాయికి తగ్గట్లు లేదు. కోల్‌కతా వేదికగా తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్.. రెండో టెస్టులోనూ పేలవ ప్రదర్శన కనబరుస్తోంది. గువాహటిలో భారత బౌలర్ల వైఫల్యం కారణంగా సఫారీలు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 489 పరుగుల మేర భారీ స్కోరు సాధించారు.
అయితే, ఇదే వేదికపై భారత బ్యాటర్లు మాత్రం తేలిపోయారు. ఫలితంగా కేవలం 201 పరుగులకే టీమిండియా తమ తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయిపోయింది. ఈ నేపథ్యంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా వాషింగ్టన్ సుందర్‌తో గౌతీ చేస్తున్న ప్రయోగాలపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ హెడ్‌కోచ్ రవిశాస్త్రి సైతం గంభీర్ (Gautam Gambhir)ను ఉద్దేశించి ఘాటు విమర్శలు చేశాడు.
కాగా స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ (Washington Sundar)ను కోల్‌కతా టెస్టులో ఊహించని విధంగా.. మూడో స్థానంలో బ్యాటింగ్‌కు పంపింది నాయకత్వ బృందం. అంతేకాదు ఆ మ్యాచ్‌లో వాషీతో ఒకే ఒక్క ఓవర్ బౌలింగ్ చేయించారు. ఇక రెండో టెస్టులో అతడిని ఏకంగా ఎనిమిదో స్థానానికి డిమోట్ చేశారు.
అసలు సెన్స్ ఉందా?
ఈ పరిణామాలపై కామెంటేటర్ రవిశాస్త్రి తనదైన శైలిలో స్పందించాడు. ‘‘అసలు సెన్స్ ఉందా?.. ఈ ఆలోచనా విధానమేమిటో నాకైతే అర్థం కావడం లేదు. ఈ సిరీస్ మొదలైనప్పటి నుంచి సెలక్టర్ల తీరు, తుదిజట్టు కూర్పు గురించి నాకేమీ అంతుపట్టడం లేదు.
కోల్‌కతాలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్‌తో ఒకే ఒక్క ఓవర్ వేయించారు. అలాంటపుడు మీరు కావాలనకుంటే స్పెషలిస్టు బ్యాటర్‌ను ఆడించాల్సింది. అలా కాకుండా వాషీని మూడో స్థానంలో పంపడం దేనికి?
ఎనిమిదో స్థానంలో ఆడిస్తారా?
కోల్‌కతా టెస్టులో వాషీని వన్‌డౌన్‌లో ఆడించిన యాజమాన్యం.. గువాహటిలో కనీసం నాలుగో స్థానంలోనైనా ఆడించాల్సింది. కానీ ఇక్కడ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు పంపారు. మరీ అంత లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేసేందుకు అతడు అర్హుడు కాదు. అతడి విషయంలో ఇంకాస్త మెరుగైన నిర్ణయం తీసుకోవాల్సింది’’ అని రవిశాస్త్రి గంభీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.
భారీ ఆధిక్యంలో సఫారీ జట్టు
కాగా టీమిండియాతో రెండో టెస్టులో సోమవారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి.. సౌతాఫ్రికా ఎనిమిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 26 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ లీడ్ (288) కలుపుకొని.. భారత్ కంటే ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇదిలా ఉంటే.. వాషీ తొలి టెస్టులో 29, 31 పరుగులు.. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 48 పరుగులతో రాణించాడు.
చదవండి: Prithvi Shaw: కెప్టెన్‌గా పృథ్వీ షా.. నేడే అధికారిక ప్రకటన


