విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో మధ్యప్రదేశ్ కెప్టెన్, ఆర్సీబీ ఆటగాడు వెంకటేష్ అయ్యర్ ఎట్టుకేలకు తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ టోర్నీలో భాగంగా గురువారం అహ్మదాబాద్ వేదికగా కర్ణాటకతో జరిగిన మ్యాచ్‌లో అయ్యర్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 208 పరుగుల లక్ష్య చేధనలో అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
తొలుత ఆచితూచి ఆడిన వెంకటేష్.. క్రీజులో కుదుర్కొన్నాక ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కేవలం 33 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతడితో పాటు యశ్ దూబే(40), త్రిపురేష్(36) రాణించారు. ఫలితంగా లక్ష్యాన్ని ఎంపీ జట్టు కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 23.2 ఓవర్లలో చేధించింది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన కర్ణాటక 47.4 ఓవర్లలో కేవలం 207 పరుగులకే ఆలౌటైంది. మధ్యప్రదేశ్ పేసర్ శివాంగ్ కుమార్ 5 వికెట్లు పడగొట్టి కర్ణాటక పతనాన్ని శాసించాడు. కర్ణాటక బ్యాటర్లలో కెప్టెన్ మయాక్ అగర్వాల్(49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఆర్సీబీకి గుడ్ న్యూస్..
ఐపీఎల్-2026లో వెంకటేశ్ అయ్యర్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడనున్నాడు. గతేడాది డిసెంబర్‌లో జరిగిన మినీ వేలంలో రూ. 7 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. అయితే ఆ తర్వాత అతడు తన స్ధాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. వరుస మ్యాచ్‌లలో తక్కువ స్కోర్లకే పరిమితమై విమర్శలు ఎదుర్కొన్నాడు.
ఈ క్రమంలో తనపై వస్తున్న విమర్శలకు అయ్యర్ తన బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌కు ముందు అయ్యర్ తన ఫామ్‌ను తిరిగి అందుకోవడంతో ఆర్సీబీ ఊపిరి పీల్చుకుంది. ఐపీఎల్-2025లో సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ కేకేఆర్ తరపున దారుణ ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతడిని కేకేఆర్ వేలంలోకి విడిచిపెట్టింది.
చదవండి: VHT 2025-26: చరిత్ర సృష్టించిన సర్ఫరాజ్.. సచిన్‌కు కూడా సాధ్యం కాలేదు


