విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో సౌరాష్ట్ర ఫైనల్స్‌కు చేరింది. నిన్న (జనవరి 16) జరిగిన రెండో సెమీఫైనల్లో పంజాబ్‌పై 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, జనవరి 18న జరిగే ఫైనల్లో విదర్భతో అమీతుమీకి సిద్దమైంది.
ఓపెనర్ విశ్వరాజ్ జడేజా అజేయ శతకంతో చెలరేగి సౌరాష్ట్రను ఒంటిచేత్తో గెలిపించాడు. 127 బంతుల్లో 18 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 165 పరుగులు చేసి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. జడేజాకు గత మూడు మ్యాచ్‌ల్లో ఇది రెండో శతకం.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 50 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (87) పవర్‌ప్లేలోనే విధ్వంసం (9 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించాడు. అనంతరం అన్మోల్‌ప్రీత్ సింగ్ (105 బంతుల్లో 100) అద్భుతమైన శతకం సాధించాడు. అయితే మధ్యలో నమన్ ధీర్, నేహల్ వాధేరా వరుసగా ఔట్ కావడంతో పంజాబ్ రన్‌రేట్ దెబ్బతింది. చివర్లో రమన్‌దీప్ సింగ్‌తో కలిసి అన్మోల్‌ప్రీత్ కొన్ని బౌండరీలు సాధించినా, చేతన్ సకారియా (4/60) ధాటికి దిగువ వరుస కూలిపోయింది.
అనంతరం 292 పరుగుల లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన సౌరాష్ట్రకు ఓపెనర్లు జడేజా, హర్విక్ దేశాయ్ (64) శుభారంభాన్ని అందించారు. పవర్‌ప్లేలోనే వీరు 92 పరుగులు సాధించి పంజాబ్ బౌలర్లపై ఒత్తిడి తెచ్చారు. 20 ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు స్కోరు 151/0కి చేరింది. అప్పటికే మ్యాచ్ దాదాపు సౌరాష్ట్ర వైపు మళ్లింది. దేశాయ్ ఔటైన తర్వాత కూడా జడేజా తన దూకుడు కొనసాగించాడు. కేవలం 74 బంతుల్లో శతకం పూర్తి చేసి, తర్వాత మరింత వేగంగా ఆడాడు.
హార్విక్ ఔటయ్యాక వచ్చిన ప్రేరక్ మాంకడ్ (52*) కూడా జడేజాకు తోడుగా బౌండరీల వర్షం కురిపించాడు. ఫలితంగా సౌరాష్ట్ర 39.3 ఓవర్లలోనే వికెట్ మాత్రమే కోల్పోయి గెలుపు తీరాలు చేరింది.


