నిన్న (జనవరి 15) జరిగిన విజయ్ హజారే ట్రోఫీ 2025-26 తొలి సెమీ ఫైనల్లో స్టార్లతో నిండిన కర్ణాటకకు విదర్భ జట్టు ఊహించని షాక్ ఇచ్చింది. అమన్ మోఖడే (138) అద్భుతమైన సెంచరీతో ఆ జట్టును గెలిపించాడు.
తద్వారా గత ఎడిషన్ ఫైనల్లో కర్ణాటక చేతిలో ఎదురైన పరాభవానికి విదర్భ ప్రతీకారం తీర్చుకుంది. ఇవాళ (జనవరి 16) జరిగే రెండో సెమీఫైనల్ విజేతతో విదర్భ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది.
పడిక్కల్ విఫలం.. రాణించిన కరుణ్ నాయర్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. విదర్భ పేసర్ దర్శన్ నల్కండే (10-0-48-5) దెబ్బకు 49.4 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. కరుణ్ నాయర్ (76), కృషణ్ శ్రీజిత్ (54) అర్ద సెంచరీలతో రాణించడంతో కర్ణాటక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది.
ఈ ఎడిషన్‌లో దేవదత్ పడిక్కల్ (4) తొలిసారి విఫలమయ్యాడు. కెప్టెన్ మయాంక్ అగర్వాల్ (9) కూడా డు ఆర్ డై మ్యాచ్‌లో హ్యాండిచ్చాడు. ధృవ్ ప్రభాకర్ (28), శ్రేయస్ గోపాల్ (36), అభినవ్ మనోహర్ (26), విజయ్ కుమార్ వైశాక్ (17) రెండంకెల స్కోర్లు చేశారు. విదర్భ బౌలర్లలో నల్కండే 5, యశ్ ఠాకూర్ 2, నచికేత్, యశ్ కదమ్ తలో వికెట్ తీశారు.
అమన్ అద్భుత శతకం
281 పరుగుల ఛేదనలో విదర్భ ఆదిలోనే అథర్వ తైడే (6) వికెట్ కోల్పోయినప్పటికీ.. మరో ఓపెనర్ అమన్ మోఖడే (138) అద్బుత శతకంతో కదం తొక్కడంతో 46.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. అమన్‌కు జతగా రవికుమార్ సమర్థ్ (76 నాటౌట్) రాణించాడు.
ధృవ్ షోరే (47) పర్వాలేదనిపించాడు. కర్ణాటక బౌలర్లలో అభిలాశ్ షెట్టి (10-0-48-3) కాస్త ప్రభావం చూపినప్పటికీ, మిగతా బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.


