సమష్టి ప్రదర్శనతో సత్తా చాటిన విదర్భ జట్టు తొలిసారి విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నీ టైటిల్‌ను కైవసం చేసుకుంది. టోర్నమెంట్ ఆసాంతం రాణించిన విదర్భ ఫైనల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ విజేతగా నిలిచింది. బెంగళూరు వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగుల తేడాతో మాజీ చాంపియన్ సౌరాష్ట్రపై గెలుపొందింది.
‘శత’క్కొట్టిన అథర్వ తైడే..
గతేడాది తుదిమెట్టుపై బోల్తా పడ్డ విదర్భ... ఈసారి పట్టు వదలకుండా ప్రయత్నించి విజయవంతమైంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన విదర్భ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఓపెనర్ అథర్వ తైడే (118 బంతుల్లో 128; 15 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీతో కదంతొక్కగా... యశ్ రాథోడ్ (61 బంతుల్లో 54; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీతో రాణించాడు.
అమన్ మోఖడే (33), రవికుమార్ సమర్థ్ (25) ఫర్వాలేదనిపించారు. ఒక దశలో 213/1తో మరింత భారీ స్కోరు చేసేలా కనిపించిన విదర్భ... ఆ తర్వాత వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. కెప్టెన్ హర్ష్ దూబే (17), మొహమ్మద్ ఫైజ్ (19) ఎక్కువసేపు నిలవలేకపోయారు. సౌరాష్ట్ర బౌలర్లలో అంకుర్ పన్వర్ 4 వికెట్లు పడగొట్టగా... చేతన్ సకారియా, చిరాగ్ జానీ చెరో రెండు వికెట్లు తీశారు.
279 పరుగులకు ఆలౌట్
అనంతరం ఛేదనలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (92 బంతుల్లో 88; 10 ఫోర్లు), చిరాగ్ జానీ (63 బంతుల్లో 64; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) హాఫ్‌సెంచరీలతో పోరాడినా ఫలితం లేకపోయింది. కెపె్టన్ హార్విక్ దేశాయ్ (20), విశ్వరాజ్ జడేజా (9), పర్‌స్వరాజ్ రాణా (7) విఫలమయ్యారు.
విదర్భ బౌలర్లలో యశ్ ఠాకూర్ 4 వికెట్లు పడగొట్టగా... నచికేత్ మూడు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. విదర్భ ప్లేయర్లు అథర్వ తైడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, అమన్ మోఖడేకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్ర మాజీ క్రికెటర్ చాముండేశ్వరనాథ్ విదర్భ జట్టుకు విన్నర్స్ ట్రోఫీ అందించారు.


