సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 ఆలౌట్
పంజాబ్ తొలి ఇన్నింగ్స్‌లో 139 ఆలౌట్
సౌరాష్ట్ర రెండో ఇన్నింగ్స్‌లో 24/3
హర్‌ప్రీత్‌కు 6 వికెట్లు
పార్థ్‌కు 5 వికెట్లు
రాజ్‌కోట్: టీమిండియా వన్డే, టెస్టు జట్ల సారథి శుబ్‌మన్ గిల్... దేశవాళీ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో ప్రభావం చూపలేకపోయాడు. గ్రూప్ ‘బి’లో భాగంగా గురువారం సౌరాష్ట్రతో ప్రారంభమైన పోరులో పంజాబ్ కెప్టెన్‌గా బరిలోకి దిగిన గిల్ (0) రెండు బంతులు ఎదుర్కొని పార్థ్ బౌలింగ్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇరు జట్ల బ్యాటర్లు సైతం స్పిన్నర్లను ఎదుర్కోవడంలో విఫలమవడంతో ఈ మ్యాచ్ తొలి రోజే 23 వికెట్లు నేలకూలాయి.
మొదట సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 47.1 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. జయ్ గోహిల్ (117 బంతుల్లో 82; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్కడే అర్ధశతకంతో రాణించగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా (7) నిరాశ పర్చగా.. హార్విక్ దేశాయ్ (13), చిరాగ్ జానీ (8), అర్పిత్ (2), సమర్ (0) ఒకరి వెంట ఒకరు పెవిలియన్‌కు వరుసకట్టారు. ప్రేరక్ మన్కడ్ (32) ఫర్వాలేదనిపించాడు.
పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 38 పరుగులిచ్చి 6 వికెట్లతో అదరగొట్టాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన పంజాబ్ తీవ్రంగా తడబడింది. 40.1 ఓవర్లలో 139 పరుగులకే ఆలౌటైంది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (60 బంతుల్లో 44; 7 ఫోర్లు), అన్‌మోల్‌ప్రీత్ సింగ్ (34 బంతుల్లో 35; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. గిల్‌తో పాటు హర్‌నూర్ సింగ్ (0), నేహల్ వధేరా (6), ప్రేరిత్ దత్తా (11), ఉదయ్ శరణ్ (23) విఫలమయ్యారు.
సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్ భట్ 33 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, ధర్మేంద్ర జడేజా చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన సౌరాష్ట్ర తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 24 పరుగులు చేసింది. హార్విక్ దేశాయ్ (6), చిరాగ్ జానీ (5), జయ్ గోహిల్ (8) అవుటయ్యారు. చేతిలో 7 వికెట్లు ఉన్న సౌరాష్ట్ర ఓవరాల్‌గా 57 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ధర్మేంద్ర జడేజా (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. ఇదే గ్రూప్‌లో భాగంగా మహారాష్ట్రతో జరుగుతున్న మ్యాచ్‌లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 82.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 19 పరుగులు చేసింది.
కర్ణాటకతో జరుగుతున్న మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ 90 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 244 పరుగులు చేసింది. చండీగఢ్‌తో మ్యాచ్‌లో కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 56 ఓవర్లలో 139 పరుగులకు ఆలౌటైంది. చండీగఢ్ 34 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 142 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించింది.


