వన్డే క్రికెట్‌లో నిలకడగా రాణించే ఆటగాళ్లు ఎవరంటే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి. అయితే కోహ్లి బాటలోనే న్యూజిలాండ్ మిడిలార్డర్ బ్యాటర్ డారిల్ మిచెల్ పయనిస్తున్నాడు. వన్డేల్లో ఈ కివీ స్టార్ అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ కోహ్లి మాదిరిగానే నిలకడగా మారు పేరుగా మారాడు.
ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో మిచెల్ సెంచరీలు మోత మ్రోగించాడు. వడోదర జరిగిన తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్‌కోట్ వన్డేలో సెంచరీ(131)తో మెరిశాడు. ఇప్పుడు ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో మిచెల్ శతక్కొట్టాడు. ఈ మ్యాచ్ టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరంభంలోనే ఓపెనర్లు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన మిచెల్ అసాధరణ ప్రదర్శన కనబరిచాడు.
మిచెల్ ఆరంభంలో భారత పేసర్లు హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లను ఎదుర్కోవడంలో సంయమనం పాటించాడు. ఆ తర్వాత క్రీజులో కుదుర్కొన్నాక తనలోని విశ్వరూపాన్ని చూపించాడు. 106 బంతుల్లోనే తన సెంచరీ మార్క్‌ను మిచెల్ అందుకున్నాడు. మిచెల్‌కు ఇది 9వ వన్డే సెంచరీ కావడం గమనార్హం. మొత్తంగా మొత్తంగా 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లతో 137 పరుగులు చేశాడు. భారత్‌పై అతడికి ఇదే అత్యధిక స్కోర్ కావడం గమనార్హం. అదేవిధంగా భారత్‌పై గత ఐదు మ్యాచ్‌లలో అతడికి ఇది నాలుగో సెంచరీ.
ఈ మ్యాచ్‌లో సెంచరీతో సత్తాచాటిన మిచెల్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. అంతర్జాతీయ వన్డేల్లో(టెస్టు క్రికెట్ హోదా కలిగిన దేశాలు) కనీసం 2000 పరుగులు చేసిన ఆటగాళ్లలో అత్యధిక సగటు కలిగిన బ్యాటర్‌గా మిచెల్ చరిత్ర సృష్టించాడు. మిచెల్ ఇప్పటివరకు 58.47 సగటుతో 2690 పరుగులు చేశాడు.
ఇంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లి పేరిట ఉండేది. కోహ్లి ఇప్పటివరకు వన్డేల్లో 58.45 సగటుతో 14673 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్‌తో కోహ్లిని మిచెల్ అధిగమించాడు. వీరిద్దరి తర్వాతి స్ధానంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్(56.34) ఉన్నాడు. ఇక ఈ సిరీస్ డిసైడర్ మూడో వన్డేలో మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 337 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో మిచెల్‌తో పాటు గ్లెన్ ఫిలిప్స్(106) సెంచరీతో మెరిశాడు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ మూడు వికెట్లు పడగొట్టగా.. సిరాజ్, కుల్దీప్ తలా వికెట్ సాధించారు.
చదవండి: IND vs NZ: టీమిండియాపై సెంచరీల మోత.. మైమరిపిస్తున్న మిచెల్


