సనత్ జయసూర్య, రికీ పాంటింగ్, కుమార సంగ్కకర, మహేలా జయవర్దనే, ఏబీ డివిలియర్స్.. వీరంతా ఒకప్పుడు భారత జట్టుపై ఆధిపత్యం చెలాయించిన దిగ్గజ బ్యాటర్లు. ముఖ్యంగా వీరిందరికి వన్డేల్లో భారత్‌పై అద్భుతమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇప్పుడు వారి బాటలోనే అడుగులు వేస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్.
ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం టీమిండియాకు కొరకరాని కొయ్యలా మారుతున్నాడు. ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్ కేవలం ఐసీసీ టోర్నీల్లో మాత్రమే భారత్‌కు తలనొప్పిగా మారితే.. మిచెల్ మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. అతడికి ప్రత్యర్ధి భారత్ అయితే చాలు చెలరేగిపోతాడు.
మిచెల్ సెంచరీల మోత..
మిచెల్ కాస్త లేటుగా అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పటికి.. అతి తక్కువ సమయంలోనే మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్డే, టీ20) తనదైన ముద్రవేసుకున్నాడు. ముఖ్యంగా అతడికి భారత్‌పై అసాధరణ వన్డే రికార్డు ఉంది. స్పిన్‌ను సమర్ధవంతంగా ఆడే మిచెల్ ఉపఖండ పిచ్‌లపై సత్తాచాటుతున్నాడు.
వన్డే ప్రపంచకప్-2023లో కూడా ఆతిథ్య టీమిండియాను మిచెల్ గడగడలాడించాడు. సెమీఫైనల్ అయితే తన విరోచిత సెంచరీతో భారత్‌ను ఓడించే అంతపనిచేశాడు. అంతకుముందు లీగ్ మ్యాచ్‌లో కూడా భారత్‌పై సెంచరీ సాధించాడు. దీంతో వన్డే ప్రపంచకప్‌లో భారత్‌పై రెండు సెంచరీలు చేసిన ఏకైక విదేశీ బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు అదే ఫామ్‌ను తాజా పర్యటనలో అతడు కొనసాగిస్తున్నాడు.
ప్రస్తుతం భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో అతడు పరుగులు వరద పారిస్తున్నాడు. తొలి వన్డేలో 84 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడిన మిచెల్.. ఆ తర్వాత రాజ్‌కోట్‌లో విరోచిత సెంచరీతో చెలరేగాడు. మళ్లీ ఇప్పుడు సిరీస్ డిసైడర్ మూడో వన్డేలోనూ శతక్కొట్టాడు. మిచెల్ భారత్‌లో తను ఆడిన చివరి ఐదు ఇన్నింగ్స్ ల్లో ఏకంగా నాలుగుల సెంచరీలు బాదేశాడు. భారత్‌పై వన్డేల్లో అతడి సగటు దాదాపు 70గా ఉంది. ఇది చాలా మంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా సాధ్యం కాలేదు.
రెండో ప్లేయర్‌గా..
భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా మిచెల్ నిలిచాడు. మిచెల్ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్‌లోనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్‌ను మిచెల్ అధిగమిస్తాడు.
చదవండి: T20 WC 2026: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో షాక్..


