టీ20 ప్రపంచకప్-2026లో పాల్గోనేందుకు తమ జట్టును భారత్‌కు పంపబోమని మొండి పట్టుతో ఉన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మరో భారీ షాక్ తగిలింది. బీసీబీ తాజాగా చేసిన 'గ్రూప్ స్వాపింగ్' ప్రతిపాదనను క్రికెట్ ఐర్లాండ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. తమ లీగ్ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడుతామని ఐరీష్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది.
ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ గ్రూపు-సిలో ఉంది. షెడ్యూల్ ప్రకారం బంగ్లా జట్టు తమ గ్రూపు మ్యాచ్‌లను కోల్‌కతా, ముంబై వేదికలగా ఆడాల్సి ఉంది. అయితే భద్రతా కారణాలను సాకుగా చూపిస్తూ ఈ మెగా టోర్నీ కోసం భారత్‌కు రాబోమని బంగ్లాదేశ్ పట్టుబడుతోంది. తాజాగా శనివారం ఢాకాలో ఐసీసీ ప్రతినిధి బృందం, బీసీబీ అధికారుల మధ్య సుదీర్ఘ చర్చలు జరిగాయి.
భారత్‌లో కట్టుదిట్టమైన భద్రత కల్పిస్తామని ఐసీసీ హామీ ఇచ్చినా, బంగ్లాదేశ్ ప్రభుత్వం, బోర్డు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ భేటిలో బంగ్లా క్రికెట్ బోర్డు ఐసీసీ ముందు మరో సరికొత్త ప్రతిపాదనను ఉంచింది. గ్రూప్-బిలో ఉన్న ఐర్లాండ్‌తో తమ గ్రూపును మార్పు చేయాలంటూ ఐసీసీని బీసీబీ కోరింది.
ఐర్లాండ్‌తో గ్రూప్ స్వాపింగ్ చేసుకుంటే లీగ్ దశ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడవచ్చని బంగ్లాదేశ్ భావించింది. కానీ అందుకు ఐర్లాండ్ నో చెప్పడంతో కథ మళ్లీ మొదటికే వచ్చింది. ఇదే విషయంపై ఐర్లాండ్ క్రికెట్ బోర్డు అధికారి ఒకరు మాట్లాడుతూ.. "మేము మొదట నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే ఆడతాం. గ్రూప్ స్టేజ్ మొత్తం శ్రీలంకలోనే జరుగుతుంది” అని చెప్పుకొచ్చారు. కాగా ముస్తాఫిజుర్ రెహ్మన్‌ను ఐపీఎల్ నుంచి విడుదల చేయడంతో ఈ వివాదం మొదలైంది. ఒకవేళ టోర్నీలో పాల్గోనేందుకు బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు రాకపోతే పాయింట్లను కోల్పోవల్సి ఉంటుంది.
చదవండి: ఇటలీ ప్రపంచకప్ జట్టులో సౌతాఫ్రికా ఆటగాడు


