భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ 2026కు ఇటలీ అర్హత సాధించింది. ఈ మెగా టోర్నీకి ఆ జట్టు తొలిసారి క్వాలిఫై అయ్యింది. ఈ టోర్నీ కోసం 15 మంది సభ్యుల జట్టును నిన్న (జనవరి 17) ప్రకటించారు. వేన్ మ్యాడ్సన్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు.
ఈ జట్టులో ఓ ఆసక్తికర ఎంపిక జరిగింది. 2017-21 మధ్యలో సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఆడిన 37 ఏళ్ల జేజే స్మట్స్ ఈ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్మట్స్ సౌతాఫ్రికా తరఫున 6 వన్డేలు, 13 టీ20లు ఆడాడు. స్మట్స్ ఇటీవల జరిగిన వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఆ టోర్నీలోని ఓ మ్యాచ్‌లో అతను ఏబీ డివిలియర్స్‌తో కలిసి విధ్వంసం సృష్టించాడు. 53 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు.
కుడి చేతి వాటం ఓపెనింగ్ బ్యాటర్, స్లో లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ బౌలర్ అయిన స్మట్స్.. ప్రస్తుతం జరుగుతున్న సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో డర్బన్ సూపర్ జెయింట్స్ తరఫున కూడా ఆడుతున్నాడు. స్మట్స్ ఇటలీ పౌరసత్వం తన భార్య నుంచి సంక్రమించుకున్నాడు.
కాగా, ఇటలీ వరల్డ్‌కప్ యూరప్ క్వాలిఫయర్స్‌లో రెండో స్థానంలో నిలవడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించింది. ఈ విభాగం నుంచి మరో జట్టుగా నెదర్లాండ్స్ ఉంది. ప్రపంచకప్ 2026లో ఇటలీ.. టు టైమ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, నేపాల్‌తో పాటు గ్రూప్-సిలో ఉంది.
ఇటలీ జట్టు ఫిబ్రవరి 9న బంగ్లాదేశ్ మ్యాచ్‌తో టీ20 వరల్డ్‌కప్ అరంగేట్రం చేయనుంది. కోల్‌కతా వేదికగా ఈ మ్యాచ్ జరునుంది. అనంతరం ఈ జట్టు ఫిబ్రవరి 12న ముంబైలో నేపాల్‌తో తలపడుతుంది.
టీ20 ప్రపంచకప్ 2026కు ఇటలీ జట్టు..
వేన్ మాడ్సెన్ (కెప్టెన్), మార్కస్ కాంపోపియానో, జియాన్ పియరో మీడే, జైన్ అలీ, అలీ హసన్, క్రిషన్ జార్జ్, హ్యారీ మానెంటి, ఆంథోనీ మోస్కా, జస్టిన్ మోస్కా, సయ్యద్ నఖ్వీ, బెంజమిన్ మానెంటి, జస్‌ప్రీత్ సింగ్, జేజే స్మట్స్, గ్రాంట్ స్టీవర్ట్, థామస్ డ్రాకా.


