శుబ్‌మన్‌ గిల్‌ ఫెయిల్‌.. జడ్డూ విఫలమైనా.. | Ranji Trophy 2026 Pun Vs Saur: Jadeja Fails Gill 2 ball Duck Fans Reacts | Sakshi
Sakshi News home page

శుబ్‌మన్‌ గిల్‌ ఫెయిల్‌.. జడ్డూ విఫలమైనా..

Jan 22 2026 4:23 PM | Updated on Jan 22 2026 5:06 PM

Ranji Trophy 2026 Pun Vs Saur: Jadeja Fails Gill 2 ball Duck Fans Reacts

టీమిండియా టెస్టు, వన్డే కెప్టెన్‌ శుబ్‌మన్‌ గిల్‌ దేశవాళీ క్రికెట్‌లో పునరాగమనం చేశాడు. ఇటీవల వన్డే టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా పంజాబ్‌ తరఫున ఒక్క మ్యాచ్‌ ఆడాడు గిల్‌. అనంతరం న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌తో బిజీ అయ్యాడు.

ఈ సిరీస్‌లో గిల్‌ సేన కివీస్‌ చేతిలో 2-1తో ఓటమిపాలై విమర్శలు మూటగట్టుకుంది. ఇక కివీస్‌తో టీ20 సిరీస్‌, టీ20 ప్రపంచకప్‌-2026 జట్టు నుంచి సెలక్టర్లు గిల్‌ (Shubman Gill)ను తప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశీ క్రికెట్‌పై దృష్టి సారించిన అతడు.. పంజాబ్‌ కెప్టెన్‌గా రంజీ సెకండ్‌ లీగ్‌ బరిలో దిగాడు.

పంజాబ్‌ తొలుత బౌలింగ్‌
రాజ్‌కోట్‌ వేదికగా సౌరాష్ట్రతో మ్యాచ్‌లో టాస్‌ ఓడిన పంజాబ్‌ తొలుత బౌలింగ్‌ చేసింది. హర్‌ప్రీత్‌ బ్రార్‌ (Harpreet Brar) ఆరు వికెట్లతో చెలరేగగా.. జసిందర్‌ సింగ్‌ రెండు, సన్వీర్‌ సింగ్‌, ప్రేరిత్‌ దత్తా చెరో వికెట్‌తో సత్తా చాటారు. ఫలితంగా సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులకే ఆలౌట్‌ అయింది.

జడ్డూ విఫలం
సౌరాష్ట్ర ఇన్నింగ్స్‌లో వన్‌డౌన్‌ బ్యాటర్‌ జై గోహిల్‌ 82 పరుగులతో టాప్‌ రన్‌ స్కోరర్‌గా నిలవగా.. ప్రేరక్‌ మన్కడ్‌ 32 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టీమిండియా సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా (7) సహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.

ఈ క్రమంలో గురువారం నాటి తొలి రోజు ఆటలోనే పంజాబ్‌ బ్యాటింగ్‌ మొదలుపెట్టింది. సౌరాష్ట్ర పేసర్‌, కెప్టెన్‌ జయదేవ్‌ ఉనాద్కట్‌ దెబ్బకు పంజాబ్‌ ఓపెనర్‌ హర్నూర్‌ సింగ్‌ (0) పరుగుల ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.

అయితే, మరో ఓపెనర్‌ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (44) నిలకడగా ఆడే ప్రయత్నం చేయగా అతడితో పాటు.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఉదయ్‌ సహారన్‌ (23)ను ధర్మేంద్రసిన్హ జడేజా పెవిలియన్‌కు పంపాడు. ఇక నాలుగో నంబర్‌ బ్యాటర్‌ నేహాల్‌ వధేరా (6)ను పార్థ్‌ భూట్‌ అవుట్‌ చేశాడు.

గిల్‌ డకౌట్‌
ఈ క్రమంలో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన గిల్‌ను సైతం పార్థ్‌ వెనక్కి పంపాడు. అతడి బౌలింగ్‌లో రెండు బంతులు ఎదుర్కొన్న గిల్‌ లెగ్‌ బిఫోర్‌ వికెట్‌ (LBW)గా పెవిలియన్‌ చేరాడు. ఇలా రీఎంట్రీలో గిల్‌కు చేదు అనుభవమే మిగిలింది. సౌరాష్ట్ర తరఫున రవీంద్ర జడేజా.. పంజాబ్‌ తరఫున గిల్‌ బరిలోకి దిగడంతో ఈ మ్యాచ్‌పై ఆసక్తి నెలకొనగా ఇద్దరూ నిరాశపరచడంతో అభిమానులు ఉసూరుమంటున్నారు.

పంజాబ్‌ ఆలౌట్‌.. సౌరాష్ట్రకుకు ఆధిక్యం
కాగా పంజాబ్‌ తరఫున ప్రభ్‌సిమ్రన్‌ (44), అన్మోల్‌ప్రీత్‌ సింగ్‌ (35) రాణించారు. మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 139 పరుగులకే ఆలౌట్‌ అయింది. సౌరాష్ట్ర బౌలర్లలో పార్థ్‌ ఐదు వికెట్లతో దుమ్ములేపగా.. రవీంద్ర జడేజా, ధర్మేంద్రసిన్హ జడేజా చెరో రెండు.. ఉనాద్కట్‌ ఒక వికెట్‌ తమ ఖాతాలో జమచేసుకున్నారు. బౌలర్ల అద్భుత ప్రదర్శన కారణంగా సౌరాష్ట్రకు 33 పరుగుల ఆధిక్యం లభించింది. బ్యాటింగ్‌లో నిరాశపరిచిన జడ్డూ బౌలింగ్‌లో మాత్రం  ఫర్వాలేదనిపించాడు.

చదవండి: షాకిచ్చిన ఐసీసీ.. బంగ్లాదేశ్‌ స్పందన ఇదే.. తుది నిర్ణయం వారిదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement