అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందించాడు. ఏదో ఒక అద్భుతం జరిగి ఐసీసీ తమ పట్ల సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. అదే సమయంలో మరోసారి భారత్ గురించి అవాకులు చెవాకులు పేలాడు.
కాగా భారత్- బంగ్లాదేశ్ మధ్య రాజకీయపరంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్-2026లో తమ మ్యాచ్‌లు ఆడేందుకు భారత్‌కు రాబోమని బంగ్లా బోర్డు (BCB) ఐసీసీకి తెలిపింది. తమ వేదికలను భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని విజ్ఞప్తి చేసింది.
ఆడితే ఆడండి.. లేకపోతే పొండి
ఈ విషయంపై చర్చించిన ఐసీసీ బుధవారం తమ తుది నిర్ణయాన్ని వెల్లడించింది. భారత్ నుంచి మ్యాచ్‌లను తరలించడం సాధ్యం కాదని... వరల్డ్ కప్‌లో ఆడాలా లేదా అనేది బంగ్లాదేశ్ తేల్చుకోవాలని స్పష్టం చేసింది. ఇందుకోసం గురువారం నాటికి తుది గడువు విధించింది.
ఒకవేళ బంగ్లాదేశ్ తమ పంతం వీడకపోతే ఆ జట్టును వరల్డ్ కప్ నుంచి తప్పిస్తామని ఐసీసీ హెచ్చరించింది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో తర్వాతి స్థానంలో ఉన్న స్కాట్లాండ్ జట్టును బంగ్లాదేశ్ స్థానంలో ఆడించాలని కూడా ఐసీసీ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బుధవారం జరిగిన ఐసీసీ బోర్డు సమావేశంలో దీనికి మద్దతుగా అత్యధిక డైరెక్టర్లు ఓటు వేశారు.
ఐసీసీ చైర్మన్ జై షాతో పాటు బీసీసీఐ తరఫున దేవజిత్ సైకియా ఇందులో పాల్గొన్నారు. 15 మంది డైరెక్టర్లు సమావేశానికి హాజరు కాగా, ఒక్క పాకిస్తాన్ మాత్రమే బంగ్లాదేశ్‌కు అండగా నిలిచింది. ఇప్పటికే బంగ్లా డిమాండ్‌కు మద్దతు ప్రకటించిన పాకిస్తాన్ తమ దేశంలో ఆ జట్టు మ్యాచ్‌లను నిర్వహిస్తామని కూడా ప్రతిపాదించింది.
ఎలాంటి ప్రమాదం లేదు..
అయితే ఇవన్నీ సాధ్యం కాదని ఐసీసీ కొట్టిపారేసింది. ‘భద్రతాపరమైన అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చాం. భారత్‌లోని ఏ వేదికపైన కూడా బంగ్లాదేశ్ ఆటగాళ్లు, మీడియా ప్రతినిధులు, ఇతర అధికారులకు ఎలాంటి ప్రమాదం లేదు.
టోర్నీ చేరువైన సమయంలో షెడ్యూల్ మార్పు ఏమాత్రం సాధ్యం కాదు. భద్రతా పరమైన కారణం అంటూ ఈసారి అలా చేస్తే ఇది చెడు సాంప్రదాయానికి దారి తీస్తూ ఐసీసీ ఈవెంట్లకు చెడ్డపేరు వస్తుంది. బంగ్లా బోర్డుకు ఇప్పటికే ఇవన్నీ పూర్తిగా వివరించాం.
అయితే ఎంత చెప్పినా వరల్డ్ కప్‌తో ఏమాత్రం సంబంధం లేని ఒక దేశవాళీ లీగ్‌లో జరిగిన ఘటనను చూపిస్తూ బంగ్లా తమ డిమాండ్‌ను కొనసాగించింది. ఎన్నో అంశాలను బట్టి వరల్డ్ కప్ మ్యాచ్‌ల షెడ్యూల్, వేదికలు ప్రకటిస్తాం. ఇప్పుడు ఎలాంటి మార్పులూ చేయలేం’ అని ఐసీసీ తమ ప్రకటనలో స్పష్టంగా పేర్కొంది.
ఇండియా మాకు భద్రం కాదు
ఈ నేపథ్యంలో బీసీబీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం స్పందిస్తూ.. ‘‘మా ప్రభుత్వంతో చర్చించేందుకు నాకు కొంత గడువు కావాలని ఐసీసీ బోర్డును అడిగాను. చివరి అవకాశం ఇమ్మని కోరాను. ఇది సరైనదేనని వారు భావించారు. 24 నుంచి 48 గంటలలోపు మా నిర్ణయం చెప్పాలన్నారు.
అయితే, ఈ విషయంలో నేను మా ప్రభుత్వంపై ఒత్తిడి పెట్టదలచుకోలేదు. ఏదేమైనా ఇండియా మాకు భద్రమైన దేశం కాదు. శ్రీలంకలో మ్యాచ్‌లు ఆడేందుకే మేము కట్టుబడి ఉన్నాము. ఐసీసీ మా అభ్యర్థనను తిరస్కరించిందని తెలుసు.
అద్భుతం జరుగుతుంది
ప్రభుత్వంతో చర్చించిన తర్వాతే మా తుది నిర్ణయం వెల్లడిస్తాం. ఐసీసీ మా విషయంలో అద్భుతం చేస్తుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీలో ఆడాలని ఎవరు మాత్రం కోరుకోరు!.. బంగ్లాదేశ్ ఆటగాళ్లతో ఐసీసీ ఈవెంట్లో ఆడాలని కోరుకుంటున్నారు.
బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా బంగ్లా క్రికెట్ జట్టు ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్లో పాల్గొనాలని ఆశిస్తోంది. అయితే, ముందుగా చెప్పినట్లు భారత్ మా ఆటగాళ్లకు సురక్షిత ప్రదేశం కాదు. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వానిదే తుది నిర్ణయం’’ అంటూ ఓవైపు వరల్డ్‌కప్ టోర్నీలో ఆడాలనే కోరిక ఉందంటూనే.. మరోవైపు భారత్ గురించి అతిగా మాట్లాడాడు.
కాగా అంతకుముందు తమ అభ్యర్థనను తిరస్కరిస్తే వరల్డ్‌కప్ బహిష్కరిస్తామంటూ బంగ్లా హెచ్చులకు పోయింది. ఇప్పుడు మాత్రం తమకు ఆడాలని ఉందంటూ తమదంతా మేకపోతు గాంభీర్యమేనని నిరూపించుకుంది. కాగా ఫిబ్రవరి 7- మార్చి 8 వరకు భారత్- శ్రీలంక వేదికలుగా ప్రపంచకప్-2026 టోర్నీ జరుగనుంది.


