పంజాబ్‌పై 194 పరుగుల తేడాతో సౌరాష్ట్ర ఘనవిజయం
శుబ్‌మన్ గిల్ మళ్లీ విఫలం
రాజ్‌కోట్: దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో పంజాబ్ జట్టుపై సౌరాష్ట్ర విజయం సాధించింది. గ్రూప్ ‘బి’లో భాగంగా రెండు రోజుల్లోనే ముగిసిన పోరులో సౌరాష్ట్ర 194 పరుగుల తేడాతో పంజాబ్‌ను చిత్తు చేసింది. పంజాబ్ జట్టుకు సారథ్యం వహిస్తున్న టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ వరుసగా రెండో ఇన్నింగ్స్‌లోనూ విఫలం కావడం ఫలితంపై ప్రభావం చూపింది.
ఓవర్‌నైట్ స్కోరు 24/3తో శుక్రవారం రెండో రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన సౌరాష్ట్ర... చివరకు 58.5 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (41 బంతుల్లో 56; 10 ఫోర్లు) అర్ధశతకంతో ఆకట్టుకోగా... టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా (44 బంతుల్లో 46; 4 ఫోర్లు), హేత్విక్ కొటక్ (39; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పార్థ్ భట్ (37 నాటౌట్; 1 ఫోర్, 3 సిక్స్‌లు) కీలక పరుగులు చేశారు.
పంజాబ్ బౌలర్లలో హర్‌ప్రీత్ బ్రార్ 5 వికెట్లు పడగొట్టగా... జస్సిందర్ సింగ్ 3 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని ప్రత్యర్థి ముందు 320 పరుగుల లక్ష్యం నిలవగా... పంజాబ్ మరోసారి పేలవ ప్రదర్శన కనబర్చింది. భారీ ఆశలు పెట్టుకున్న శుబ్‌మన్ గిల్ (32 బంతుల్లో 14; 1 ఫోర్) విఫలమవడంతో పంజాబ్ చివరకు 39 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది.
ఉదయ్ శరణ్ (71 బంతుల్లో 31; 2 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా చేతులెత్తేశారు. సౌరాష్ట్ర బౌలర్లలో లెఫ్టార్మ్ స్పిన్నర్ పార్థ్ భట్, ధర్మేంద్ర జడేజా చెరో 5 వికెట్లు పడగొట్టారు. ముఖ్యంగా తొలి ఇన్నింగ్స్‌లో గిల్ సహా ఐదు వికెట్లు తీసిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ పార్థ్ భట్... రెండో ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు వేసి కేవలం ఎనిమిది పరుగులే ఇచ్చి 5 వికెట్లు తీయం విశేషం.
రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్‌ను పార్థ్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అంతకుముందు సౌరాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేయగా... పంజాబ్ 139 పరుగులు చేసింది. ఈ విజయంతో సౌరాష్ట్ర పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరి నాకౌట్ అవకాశాలను మెరుగు పరుచుకోగా... పంజాబ్ మూడో ఓటమితో క్వార్టర్స్ రేసుకు దూరమైంది.
ఇదే గ్రూప్‌లో భాగంగా జరుగుతున్న మరో మ్యాచ్‌లో మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 323 పరుగులకు ఆలౌట్ కాగా... కర్ణాటక 58 ఓవర్లలో 8 వికెట్లకు 168 పరుగులు చేసింది. మహారాష్ట్రతో మ్యాచ్‌లో గోవా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 209 పరుగులకు ఆలౌట్ కాగా... మహారాష్ట్ర 91 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. కేరళతో మ్యాచ్‌లో చండీగఢ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేయగా... కేరళ రెండో ఇన్నింగ్స్‌లో 5.5 ఓవర్లలో 2వికెట్ల నష్టానికి 21 పరుగులు చేసింది.


