జమ్మూకశ్మీర్ విజయలక్ష్యం 126
ప్రస్తుతం 43/2
బెంగాల్‌ను హడలెత్తించిన నబీ, సునీల్
కల్యాణి (పశ్చిమ బెంగాల్): ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్ రంజీ ట్రోఫీలో తొలిసారి ఫైనల్ చేరేందుకు జమ్మూకశ్మీర్ జట్టుకు సువర్ణావకాశం లభించింది. మాజీ విజేత బెంగాల్ జట్టుతో జరుగుతున్న రెండో సెమీఫైనల్లో జమ్మూకశ్మీర్ మరో 83 పరుగులు సాధిస్తే టైటిల్ పోరుకు అర్హత సాధిస్తుంది. బెంగాల్ నిర్దేశించిన 126 పరుగుల విజయలక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్... మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 43 పరుగులు సాధించింది. జమ్మూకశ్మీర్ గెలవాలంటే మరో 83 పరుగులు చేయాలి. చేతిలో ఎనిమిది వికెట్లు ఉన్నాయి.
అంతకుముందు మూడో రోజు బౌలర్ల హవా నడిపించారు. మూడో రోజు ఆటలో 17 వికెట్లు నేలకూలడం విశేషం. ఓవర్‌నైట్ స్కోరు 198/5తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశ్మీర్ జట్టు 76.1 ఓవర్లలో 302 పరుగులకు ఆలౌటైంది. చివరి వరుస బ్యాటర్లు ఆకిబ్ నబీ (54 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్), యుధ్‌వీర్ సింగ్ (42 బంతుల్లో 33; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొమ్మిదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు.
భారత బౌలర్, బెంగాల్ స్పీడ్‌స్టర్ మొహమ్మద్ షమీ 90 పరుగులిచ్చి 8 వికెట్లు పడగొట్టాడు. మిగతా రెండు వికెట్లు ముకేశ్ కుమార్‌కు దక్కాయి. 26 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సంపాదించిన బెంగాల్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కుప్పకూలింది. జమ్మూకశ్మీర్ పేస్ బౌలర్లు ఆకిబ్ నబీ, సునీల్ కుమార్, యు«ద్‌వీర్ సింగ్ ధాటికి బెంగాల్ 25.1 ఓవర్లలో కేవలం 99 పరుగులకే ఆలౌటైంది.
క్వార్టర్ ఫైనల్లో డబుల్ సెంచరీ, సెమీఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ సెంచరీ చేసిన బెంగాల్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి రెండో ఇన్నింగ్స్‌లో ‘సున్నా’కే వెనుదిరిగాడు. కెపె్టన్ అభిమన్యు ఈశ్వరన్ 5 పరుగులు చేశాడు. నబీ 36 పరుగులిచ్చి 4 వికెట్లు, సునీల్ కుమార్ 27 పరుగులిచ్చి 4 వికెట్లు, యుధ్‌వీర్ సింగ్ 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీసి బెంగాల్‌ను దెబ్బ కొట్టారు. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జమ్మూకశ్మీర్‌కు కూడా శుభారంభం లభించలేదు.
ఓపెనర్లు శుభమ్ ఖజురియా (1), యావర్ హసన్ (6) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరుకున్నారు. శుభమ్ పుందిర్ (23 బ్యాటింగ్), వన్షజ్ శర్మ (9 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. రంజీ ట్రోఫీ చరిత్రలో 10 వేల పరుగులు పూర్తి చేసిన రెండో ప్లేయర్, కెపె్టన్ పారస్ డోగ్రా, అబ్దుల్ సమద్ ఇంకా బ్యాటింగ్‌కు రావాల్సి ఉండటంతో జమ్మూకశ్మీర్‌కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే షమీ, ముకేశ్ కుమార్, షహబాజ్ అహ్మద్ బంతితో మెరిస్తే బెంగాల్ జట్టు కూడా విజయం ఆశించవచ్చు.
సంక్షిప్త స్కోర్లు
బెంగాల్ తొలి ఇన్నింగ్స్: 328 ఆలౌట్; జమ్మూకశ్మీర్ తొలి ఇన్నింగ్స్: 302 ఆలౌట్; బెంగాల్ రెండో ఇన్నింగ్స్: 99 ఆలౌట్ (25.1 ఓవర్లలో) (షహబాజ్ అహ్మద్ 24, సూరజ్ జైస్వాల్ 14, అనుస్తుప్ 12, ఆకిబ్ నబీ 4/36, సునీల్ 4/27, యుధ్‌వీర్ 2/29), జమ్మూకశ్మీర్ రెండో ఇన్నింగ్స్: 43/2.


