భారత క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మిజోరంకు చెందిన ఫస్ట్ క్లాస్ క్రికెటర్ కె. లాల్రెమ్రుటా (38) గుండె పోటుతో మృతి చెందాడు. ఈ విషయాన్ని క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం ధ్రువీకరించింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్‌కు సమీపంలోని సిహ్ముయ్‌లో సెకండ్ డివిజన్ స్క్రీనింగ్ టోర్నమెంట్ జరుగుతోంది.
ఈ టోర్నీలో వెంగ్‌నువాయ్ రైడర్స్ క్రికెట్ క్లబ్‌కు ప్రాతినిథ్యం వహించిన లాల్రెమ్రుటా.. గురువారం చాన్‌పుయ్ క్రికెట్ క్లబ్‌తో మ్యాచ్ జరుగుతుండగానే మైదానంలో ఒక్కసారిగా కుప్పకూలాడు. వెంటనే అతడిని హుటాహుటిన అస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే లాల్రెమ్రుటా మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. లాల్రెమ్రుటా మృతి పట్ల క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ మిజోరం తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.
"లాల్రెమ్రుటా రెండు రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో మిజోరంకు ప్రాతినిధ్యం వహించాడు. అదేవిధంగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా ఏడు మ్యాచ్‌లు ఆడాడు. రాష్ట్ర స్ధాయిలో కూడా చాలా మ్యాచ్‌లలో తన ప్రతిభను చాటుకున్నాడు.
మిజోరం ఒక గొప్ప క్రికెటర్‌ను కోల్పోయింది. లాల్రెమ్రుటా కుటంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాము" అని సీఏఎం ఒక ప్రకటనలో పేర్కొంది. మిజోరం క్రీడా శాఖా మంత్రి లాల్‌గింగ్లోవాహ్మర్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
చదవండి: IPL 2026: ఆర్సీబీకి గుడ్ న్యూస్.. ఫామ్‌లోకి వచ్చిన డేంజరస్ ప్లేయర్


