గుండెజబ్బుల రిస్క్‌ ఎవరికి ఎక్కువ? | Sudden cardiac arrest Symptoms causes prevention full details | Sakshi
Sakshi News home page

గుండెజబ్బులకు అవకాశమున్నది ఎవరికంటే...

Feb 10 2026 7:57 PM | Updated on Feb 10 2026 8:00 PM

Sudden cardiac arrest Symptoms causes prevention full details

హార్ట్‌ఎటాక్‌ అంటే చాలామందికి ఆందోళన. కుటుంబంలో ఎవరికైనా లేదా చుట్టుపక్కల వాళ్లలో ఎవరికైనా హార్ట్‌ ఎటాక్‌ వచ్చి... నిన్నటి వరకూ తమతోనే ఉన్న వ్యక్తి అకస్మాత్తుగా మిస్‌ అయిపోవడం ఎందరికో విషాదంతో కూడిన ఆశ్చర్యకరమైన అంశం. అందుకే... గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటే బాగుండు అనే భావన. మరికొందరిలో... రక్తాన్ని పలచబార్చేవీ, గుండెనొప్పి అనిపించగానే నాలుక కింద పెట్టుకోమ్మని డాక్టర్లు చెప్పేవాటి గురించి విని... అలాంటి ఏవైనా మందులున్నాయనే అభిప్రాయం కూడా ఉంటుంది. నిజంగా గుండెపోటును నివారించే మందులేమైనా ఉంటాయా అన్న విషయం గురించి అసలు వాస్తవాలేమిటో చూద్దాం.

ఓ కేస్‌ స్టడీ... 
శ్రీధర్‌ వాళ్ల నాన్నగారు చాలా చిన్నప్పుడే హార్ట్‌ ఎటాక్‌తో పోయారు. ఇటీవలే వాళ్ల చిన్నాన్నకు కూడా అకస్మాత్తుగా హార్ట్‌ ఎటాక్‌ వచ్చింది. అయితే అదృష్టవశాత్తూ ఆయనకేమీ కాలేదుగానీ... ఒకటోసారీ, రెండోసారి హార్ట్‌ ఎటాక్‌ ఉపేక్షిస్తుందేమోగానీ మూడోసారి వచ్చిందంటే మాత్రం తప్పక ప్రాణాపాయం కలుగుతుందంటూ చుట్టుపక్కలవారు చెబుతుండటంతో అతడిలో ఆందోళన ఇంకా పెరిగిపోతోంది. అయితే శ్రీధర్‌కు ఇప్పటికైతే ఎలాంటి సమస్యా లేదు. కాకపోతే అతడి వయసు నలభై ప్లస్‌. కుటుంబంలో చాలామందికి హార్ట్‌ ఎటాక్‌ రావడం, పైగా నాన్నగారు హార్ట్‌ ఎటాక్‌తో పోవడంతో వంశపారంపర్యంగా తనకూ హార్ట్‌ ఎటాక్‌ వస్తుందేమోనన్న ఆందోళన అతడిని నిలువనీయడం లేదు. దాంతో తమకు తెలిసిన కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి... ‘‘మా నాన్నకూ, చిన్నాన్నకూ వచ్చినట్టుగా నాకు హార్ట్‌ ఎటాక్‌ రాకుండా ఉండేందుకు మందులివ్వండం’’టూ డాక్టర్‌ను అడగసాగాడు.

శ్రీధర్‌కు వచ్చిన సందేహమే చాలామందిలో ఉంటుంది. ‘‘గుండెపోటు వచ్చాక కొన్ని రకాల మందులు తీసుకోవడం తప్పదు కదా. అయితే... అసలది రాకుండానే నివారించుకునేందుకు మొదట్నుంచీ ఆ మందులు తీసుకోవచ్చా?... ఇలాంటి నివారణ మందులేమైనా ఉన్నాయా?’’ అనే సందేహం కొందరిలో మెదులుతుంటుంది. మరీ ముఖ్యంగా కుటుంబంలో గుండెపోటు వచ్చినవారుండటం... వారేవో కొన్ని రకాల మందులు వాడుతుండటంతో... అవే మందులు తామూ వాడితే గుండెపోటు రాదేమో అనే ఆలోచనా ఉంటుంది. ఎందుకంటే... ఒకసారి గుండెపోటుకు గురైనవారికి మళ్లీ అది రాకుండా ఉండేందుకు డాక్టర్లు కొన్ని మందులు సూచిస్తుంటారు. ఉదాహరణకు... అలాంటి పేషెంట్లు ఆస్పిరిన్, క్లోపిడోగ్రెల్, రామిప్రిల్‌ వంటి మందులతో పాటు, బీటాబ్లాకర్, స్టాటిన్స్‌ వంటి మందుల్ని వాడుతుంటారు. దాంతో అవే మందుల్ని మనమూ తీసుకుంటూ ఉంటుంటే గుండెపోటును నివారించవచ్చు కదా అనే సందేహం రావడం చాలా సాధారణం.

గుండెపోటు / గుండెజబ్బులకు అవకాశమున్నది ఎవరికంటే...  
కొందరిలో స్వాభావికంగానే గుండెజబ్బులు వచ్చే అవకాశాలెక్కువ. కొన్ని అంశాలు గుండెజబ్బులు / గుండెపోటుకు ఆస్కారమిస్తాయి. వాటిని రిస్క్‌ఫ్యాక్టర్స్‌గా చెప్పవచ్చు. అవేమిటంటే... 
ఇవీ ఆ రిస్క్‌ఫ్యాక్టర్స్‌...
వయసు : నలభై ఏళ్ల వయసు దాటాక గుండెజబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ. 
డయాబెటిస్‌ : చక్కెర వ్యాధి (మధుమేహం) ఉన్నవారిలో గుండె జబ్బులకు అవకాశాలెక్కువ. 
రక్తపోటు : అధికరక్తపోటు (హై–బీపీ) ఎక్కువగా ఉన్నవారిలో... 
కొలెస్ట్రాల్‌ : రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌ వంటి కొవ్వు పదార్థాలు నిర్ణీత మోతాదు కంటే ఎక్కువగా ఉన్నవారిలో. 
స్మోకింగ్‌ : పొగతాగే అలవాటు ఉన్నవారిలో.  
స్థూలకాయం : ఉండాల్సిన దాని కంటే ఎక్కువ బరువు ఉన్నవారిలో గుండెజబ్బులూ / గుండెపోటు వచ్చే అవకాశాలెక్కువ. 
మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండటం, నిద్ర సరిగా పోకపోవడం, తల్లిదండ్రులు లేదా తోడబుట్టినవాళ్లులో తక్కువ వయసులో హార్ట్‌ ఎటాక్‌ రావడం వంటివి కూడా రిస్క్‌ ఫ్యాక్టర్లే.

పురుషుల్లో గుండెజబ్బుల రిస్క్‌ ఎక్కువ... 
మహిళలతో పోలిస్తే పురుషుల్లో గుండెజబ్బులకు ముప్పు ఎక్కువ. మహిళల్లో రుతుస్రావం కొనసాగుతున్నంత వరకూ వారిలో స్రవించే ఈస్ట్రోజెన్‌ కారణంగా వాళ్లకు ఓ స్వాభావిక రక్షణ ఉంటుంది. అయితే మహిళల్లో రుతుస్రావం ఆగాక (మెనోపాజ్‌ తర్వాత) ఈస్ట్రోజెన్‌ స్రావాలు తగ్గుతాయి కాబట్టి.. ఆ దశ తర్వాత పురుషులకూ, మహిళలకూ గుండెపోటు వచ్చే అవకాశాలు సమానంగా ఉంటాయి.

రామిప్రిల్‌ : ఈ మందు హైబీపీని (రక్తపోటును) తగ్గించి... తద్వారా గుండెపోటు వచ్చే అవకాశాలను తగ్గిస్తుంది కాబట్టి గుండెపోటు వచ్చిన తర్వాత రామిప్రిల్‌గానీ... అలాంటి మరికొన్ని మందులుగానీ డాక్టర్లు సూచిస్తుంటారు.  

అయితే ముందుజాగ్రత్తగా ఆహారంలో ఉప్పు మోతాదు, కొవ్వు పదార్థాలు తగ్గించడం, మద్యపానం మానివేయడం, నడక లాంటి వ్యాయామాలు చేయడం, పచ్చికూరలు తీసుకోవడం వంటి సూచనలనూ ఈ మందు తీసుకుంటూ పాటిస్తుండాలి. 

బీటాబ్లాకర్స్‌ : ఒకసారి గుండెపోటు (Heart attack) వచ్చిన తర్వాత గుండె పంపింగ్‌ తగ్గినవారికి మాత్రమే ఇవి ఉపయోగపడతాయి. 
అయితే బీటాబ్లాకర్స్‌ వాడేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే... ఇవి వాడినప్పుడు రక్తపోటు (బీపీ) తగ్గే అవకాశముంటుంది. కాబట్టి బీపీని జాగ్రత్తగా మానిటర్‌ చేసుకుంటూ ఉండాలి.  

ఈ మందులతో నివారణ ఎప్పడూ... ఎలాగంటే... 
హై రిస్క్‌ ఉన్నవారికి మాత్రమే : ఇవి సెకండరీ ప్రివెన్షన్‌ కోసం మాత్రమే. 
ఆస్పిరిన్‌ను సాధారణంగా... ఒకసారి గుండెజబ్బులు కనిపించిన వారికి మాత్రమే ఉపయోగిస్తారు. మునుపు డయాబెటిస్‌ ఉండి, గుండెజబ్బు లేనివారికి కూడా ప్రైమరీ ప్రివెన్షన్‌ కోసం ఆస్పిరిన్‌ను వాడేవారు. అయితే కొత్త పరిశోధనల ఆధారంగా ఇప్పుడు ఆస్పిరిన్‌ను కేవలం సెకండరీ ప్రివెన్షన్‌ కోసం మాత్రమే ఉపయోగిస్తున్నారు. 
పై అంశాలు లేకపోతే ఆస్పిరిన్‌ వాడటం వల్ల ప్రయోజనం కంటే రిస్కే ఎక్కువ.

మందులెప్పుడూ సెకండరీ ప్రిపెన్షన్‌గానే... 
ఆరోగ్య సమస్య ఏదీ లేనప్పుడు... అది రాకుండా చూసుకునేందుకు పాటించే నివారణ చర్యలను ప్రాథమిక నివారణ’ (ప్రైమరీ ప్రివెన్షన్‌) అంటారు. అయితే  గుండెపోటుగాని, బ్రెయిన్‌స్ట్రోక్‌గాని ఒకసారి వచ్చాక... అది  మళ్లీ రాకుండా ఉండేందుకు కొన్ని రకాల మందులు తీసుకోవడం, అలాగే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం చాలా సాధారణంగా జరిగే ప్రక్రియ. ఈ మందులు తీసుకోవడాన్ని, అలాగే ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించే పద్ధతిని ‘సెకండరీ ప్రివెన్షన్‌’గా చెబుతారు.  

సాధారణంగా మధుమేహం (డయాబెటిస్‌), రక్తపోటు (హైబీపీ) ఉందని బయటపడ్డ తర్వాత అది గుండెపోటుకు లేదా గుండెజబ్బులకు దారితీయకుండా కొన్ని రకాల మందులు వాడటం లేదా కొన్ని ఆరోగ్య నియమాలు పాటించడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం చేస్తుంటారు. దీన్ని ప్రైమరీ ప్రివెన్షన్‌గా చెప్పవచ్చు.  అసలు డయాబెటిస్‌గానీ లేదా రక్తపోటు (హైబీపీ)గానీ రాకుండా ముందుగానే  జాగ్రత్త పడటం ‘ప్రైమార్డియల్‌ ప్రివెన్షన్‌’ అవుతుంది. ఈ ప్రివెన్షన్‌ ప్రైమరీ ప్రివెన్షన్‌ కంటే ఇంకా ముందు దశ. అంటే రిస్క్‌ ఫ్యాక్టర్లు కనిపించకముందే... నివారణ చర్యలు చేపట్టడం అన్నమాట. అంతేతప్ప... సెకండరీ ప్రివెన్షన్‌లో వాడే మందులను ముందునుంచే గుండెపోటు రాకుండా ఉండేందుకు వాడే మందులుగా పొరబడకూడదు.

సెకండరీ ప్రివెన్షన్‌గా వాడే మందులివి... 
ఆస్పిరిన్‌: సాధారణంగా నొప్పుల నివారణకు వాడే ఆస్పిరిన్‌ మాత్ర రక్తాన్ని పలచబార్చడం కోసం కూడా సమర్థంగా ఉపయోగపడుతుంది. అలా పరచబార్చడం వల్ల రక్తనాళాల్లో రక్తం గడ్డలుగా పేరుకుపోయే అవకాశం తగ్గుతుంది. ఫలితంగా గుండెపోటు వచ్చే అవకాశాలూ తగ్గుతాయి. అందుకే ఒకసారి గుండె΄ోటు వచ్చినవారు జీవితాంతం ఆస్ప్రిన్‌ మాత్ర క్రమం తప్పకుండా వాడుతూనే ఉండాలి.

అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే... గుండెజబ్బు లేకుండానే ఆస్పిరిన్‌ వాడటం వల్ల అంతగా ఫలితమేమీ కనిపించదు. పైగా ముందునుంచే మాత్రలు వేసుకోవడం వల్ల రక్తం పలచబారిపోవడం వల్ల ఏ చిన్నదెబ్బ లేదా చిన్నగాయానికైనా ఆగకుండా రక్తస్రావమై... ఆ కారణంగా పరిస్థితి ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉంటుంది. అందుకే కొంతకాలం క్రితం డయాబెటిస్‌ ఉన్నవాళ్లకు గుండెజబ్బులు ఉన్నా లేకపోయినా ఆస్పిరిన్‌ ఇచ్చేవారు. కానీ... ఆ కారణంగా సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువని కొన్ని శాస్త్రపరిశోధనల్లో వెల్లడయ్యాక డయాబెటిస్‌ ఉన్న ప్రతి ఒక్కరికీ కాకుండా కేవలం హై రిస్క్‌ ఉన్నవారికి మాత్రమే ఆస్పిరిన్‌ సూచిస్తున్నారు.

స్టాటిన్స్‌ : రక్తంలోని కొవ్వుల మోతాదులను తగ్గించే మందులివి. మరీ ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్‌ అయిన లో–డెన్సిటీ లైప్రొటీన్‌ (ఎల్‌డీఎల్‌) అనే కొవ్వులను తగ్గిస్తాయి. అందుకే గుండెపోటు వచ్చిన ప్రతివారికీ ఈ మందును జీవితాంతం సూచిస్తారు. అంతేకాదు... డయాబెటిస్‌ ఉన్నవారికి గుండెజబ్బుల ముప్పు కూడా పెరగడం వల్ల చక్కెర వ్యాధి ఉన్నవారు స్టాటిన్లు కూడా వాడాలంటూ డాక్టర్లు సూచిస్తారు. 

చ‌ద‌వండి: ఫిట్స్‌తో ఎవ‌రైనా ప‌డిపోతే ఇలా చేయ‌కండి

ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే... కేవలం రిస్క్‌ ఎక్కువగా ఉన్నవారికి మాత్రమే గాక... తక్కువ రిస్క్‌ ఉన్నవారికి సైతం స్టాటిన్స్‌ వాడటం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ అని తేలింది. దాంతో రక్త పరీక్షల్లో ‘హెచ్‌ఎస్‌ సిఆర్‌పీ’ విలువ – 2 ఎంజీ కంటే ఎక్కువగా ఉంటే గుండె΄ోటు లేనివాళ్లకూ గుండెజబ్బులను నివారించవచ్చని తేలింది. ‘సీటీ స్కాన్‌’తో చూసే ‘కరొనరీ క్యాల్షియమ్‌ స్కోర్‌’ ఎక్కువ ఉన్నప్పుడు కూడా డాక్టర్లు స్టాటిన్స్‌ను సూచిస్తారు. అందుకే స్టాటిన్స్‌ వాడాలంటే ముందుగా డాక్టర్‌ సూచనల మేరకు తగిన పరీక్షలు చేసి అవి తీసుకోవాలా లేదా అన్నది కేవలం డాక్టర్లు మాత్రమే నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

వ్యాయామంతో గుండెజబ్బులు దూరం  
ప్రతిరోజూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యాయామం చేయడం గుండెజబ్బులు / గుండెపోటుకు మంచి నివారణ అని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే ఈ వ్యాయామం కేవలం మొక్కుబడిగా కాకుండా... ప్రతిరోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలి. కాకపోతే మరీ ఎక్కువగా శ్రమ కలిగించేలా ఉండకూడదు. అలాగని మరీ విశ్రాంతిగా కూడా ఉండకూడదు. శరీరానికి మరీ ఎక్కువ శ్రమ కలగని రీతిలో ఉండే బ్రిస్క్‌వాకింగ్, ఈత లేదా ఏదైనా స్పోర్ట్‌ వంటి వ్యాయామాలు మంచివి. మరీ ఎక్కువగా శ్రమ కలిగించేవి అకస్మాత్తుగా మొదలుపెట్టకూడదు. తీవ్రతను క్రమంగా పెంచుకుంటూ పోవడం మంచి పద్ధతి.

ఏయే కొలతలు ఎంతెంత ఉండాలంటే... 
గుండెజబ్బులు ఉన్నవారిలో రక్తపోటు విలువ 130/80 కంతే తక్కువగా ఉండాలి. 
కొలెస్ట్రాల్‌ మోతాదులు : 
రక్తంలో పూర్తి కొలెస్ట్రాల్‌ మోతాదులు... 200 కంటే తక్కువ ఉండాలి. 
చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్‌) మోతాదులు... 100 కంటే తక్కువ ఉండాలి. గుండె జబ్బులు ఉన్నవారికి 70 కంటే తక్కువగా ఉండాలి. 
మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) మోతాదులు... 40 కంటే ఎక్కువగా ఉండాలి. 
ట్రైగ్లిజరైడ్స్‌ అనే రకం కొవ్వుల మోతాదులు... 200 కంటే తక్కువగా ఉండాలి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement