వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అమెరికా- భారత సంబంధాలపై మరోసారి స్పందిస్తూ కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రధాని మోదీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలను వెల్లడించారు. అమెరికాతో భారత్ వాణిజ్య సమస్యలు, రక్షణ కొనుగోళ్ల విషయమై మోదీ తనను ‘సర్’ అని పిలిచారని, ఎంతో వినయంగా మాట్లాడారని ట్రంప్ చెప్పుకొచ్చారు. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘అమెరికా నుంచి భారత్ అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. కానీ, గత ఐదేళ్లుగా భారత్ వాటిని పొందలేదు. ఈ క్రమంలో ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో భాగంగా.. నాతో మాట్లాడటానికి వచ్చారు. ఆ సమయంలో మోదీ నన్ను సర్ అని సంభోదించారు. సర్, దయచేసి నేను మిమ్మల్ని కలవవచ్చా? అని వినయంగా అడిగారు అని అన్నారు. ఇదే సమయంలో మోదీతో తనకు మంచి సంబంధం ఉందని ట్రంప్ చెప్పుకొచ్చారు.
అలాగే, భారత్ 68 అపాచీ హెలికాప్టర్లను ఆర్డర్ చేసింది. హెలికాప్టర్ల కోసం ఎదురుచూస్తోంది. తాను అది చేసి చూపించానని ట్రంప్ పేర్కొన్నారు. స్నేహపూర్వక దేశాలు కీలకమైన రక్షణ పరికరాల కోసం చాలా కాలం నుంచి ఎదురుచూస్తుండగా, కొనుగోలు వ్యవస్థల్లో సంస్కరణలు అవసరమని ట్రంప్ అభిప్రాయపడ్డారు. భారతదేశం వంటి దేశాలు, ఇప్పటికే ఆమోదించిన పరికరాల కోసం డెలివరీలో జాప్యం ఎదుర్కోకూడదని అన్నారు. మరోవైపు.. అపాచీ డెలివరీలలోనే కాకుండా, F-35 వంటి అధునాతన ఫైటర్ జెట్‌లలో కూడా ఆలస్యంపై విమర్శించారు. ఇటువంటి సుదీర్ఘ సమయాలు, రక్షణ భాగస్వామ్యాలలో విశ్వాసాన్ని, సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని ట్రంప్ వాదించారు. ప్రధాని మోడీ వ్యక్తిగతంగా ఈ ఆలస్యాలపై ఆందోళన వ్యక్తం చేశారని, వారి బలమైన వ్యక్తిగత సంబంధం సున్నితమైన విషయాలపై చర్చలు జరిపినట్లు తెలిపారు.
ఇదే సమయంలో అమెరికా ఆర్థిక వ్యవస్థపై సుంకాల ప్రభావాన్ని హైలైట్ చేస్తూ ట్రంప్ ఇలా అన్నారు. సుంకాల కారణంగా అమెరికన్లు ధనవంతులు అవుతున్నారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. సుంకాల కారణంగా మన దేశంలోకి 650 బిలియన్ డాలర్లకు పైగా డబ్బు వస్తుంది అంటూ వ్యాఖ్యలు చేశారు.
నేను సంతోషంగా లేను..
ఇక, అంతకుముందు ప్రధాని మోదీ, భారత్‌పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తుండటంపై తాను సంతోషంగా లేనని, భారత్‌పై అమెరికా అతి త్వరలో సుంకాలను పెంచే అవకాశముందని మోదీకి ఈ విషయం తెలుసు అంటూ ట్రంప్ పేర్కొన్నారు. అలాగే, నన్ను సంతోషపెట్టాలని వాళ్లు (భారత్) అనుకుంటున్నారు. ప్రధాని మోదీ మంచి చాలా మంచి వ్యక్తి. నేను సంతోషంగా లేనన్న విషయం ఆయనకు తెలుసు. నన్ను సంతోషపెట్టడం చాలా ముఖ్యం. వారు రష్యాతో వ్యాపారం కొనసాగిస్తే.. మేం సుంకాలను పెంచుతాం. 50 శాతానికి పైగా సుంకాలు విధిస్తాం. అది వారికి ఏమాత్రం బాగోదు. మా ఆంక్షలు రష్యాను తీవ్రంగా బాధిస్తున్నాయి’ అంటూ భారత్ గురించి ప్రస్తావించారు.


