ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోతేనేం.. ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలనే కలను కనొచ్చు, నిజం చేసుకోవచ్చు. అందుకు పరిమితులు అనేవి ఎన్నటికి అడ్డంకి కావు అని నిరూపించింది ఓ సెక్యూరిటీ గార్డు కుమార్తె. పైగా చిన్న వయసులోనే భారత ఆర్మీ ఆఫీసర్ అయ్యి.. అరుదైన రికార్డు సృష్టించింది. ముఖ్యంగా ఈశాన్య భారతదేశం నుంచి ఈ ఘనత సాధించిన తొలి అమ్మాయిగా నిలిచింది. ఎవరా ఆ అమ్మాయి..? ఏమా కథ..? చకచక చదివేయండి మరి...
ఆ అమ్మాయే మణిపూర్‌లోని సేనాపతి జిల్లాలోని రాలూనామీ గ్రామానికి చెందిన ఎనోని. ఆమె మాఓ నాగా అనే గిరిజన తెగకు చెందింది. ఈ తెగకు చెందిన ప్రజలు మణిపూర్, నాగాలాండ్ అంతటా ఉంటారు. ఇక ఎనోని తండ్రి ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు. తన తండ్రి జీతంపైనే ఆరుగురు పిల్లలు చదువు, పోషణ చూసుకోవాల్సి ఉండేది. ఎనోని ఆ ఆరుగురిలో ఆఖరి అమ్మాయి.
అయితే ఆమె తల్లిదండ్రులు ఇంట్లో ఎంతటి దారిద్యం తాండవించినా..వారి చదువుల విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా తమకు చేతనైంనతలో చదివించే యత్నమే చేశారు. ఇక ఎనోని ఆర్మీ వైపుకి ఎలా వచ్చిందంటే..
ఎమనిదో తరగతి నుంచే మొదలు..
నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC)లో మహిళలు ఎక్కువగా పాల్గొనడానికి అనుమతించబడిన సమయంలోనే ఎనోనికి భారత సైన్యంలో చేరాలనే ఆకాంక్ష ఉంది. సాయుధ దళాల క్రమశిక్షణ, యూనిఫాం అంటే మహా ఇష్టం. ఆ యునిఫాంని ఎప్పుడు ధరిస్తానా అని అనుకునేది. ఆమె పాఠశాలలో చదువుకునే సమయంలోనే ఎన్‌సీసీలో చేరింది.
తర్వాత NCC సీనియర్ వింగ్ శిక్షణను కొనసాగించడానికి ఢిల్లీకి వెళ్లింది. ఒక మారుమూల గ్రామానికి చెందిన యువతికి ఇది ఒక ప్రతిష్టాత్మకమైన అడుగు. ప్రతి అడుగు కొత్త సవాళ్లను తెచ్చిపెట్టింది..అయినా తన సంకల్ప బలాన్ని వదులుకునేది కాదు.
తండ్రి లాఠీ తనకు ఖడ్గంగా ..
కఠినమైన శిక్షణ సమయంలో అలసట లేదా విసుగు వచ్చినప్పుడల్లా.. ఎనోని తన తండ్రి త్యాగాలను గుర్తు చేసుకుంటూ..ముందుకు నడిచేది. అతను చేతిలో లాఠీతో చల్లని రాత్రులలో కాపలాగా నిలబడి ఉండగా..తాను ఏదో ఒక రోజు కత్తిని చేత ధరించి భారతీయ సైనిక అధికారిగా భుజాలపై నక్షత్రాలు ధరించాలనే ఆశతో అవిశ్రాంతంగా శిక్షణ తీసుకుంది. ముందు ఇండియన్ మిలటరీ అకాడమీ(ఐఎంఏ)లో కఠినమైన శిక్షణలో విజయం సాధించింది.
ఆ తర్వాత ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో మాత్రం కాస్త ఒత్తిడికి గురైంది. ఎందుకంటే ఇక్కడ అత్యంత కఠినమైన శిక్షణ ఉంటుంది. శారీరకంగా, మానసికంగా భావోద్వేగపరంగా కఠినమైన శిక్షణను పూర్తి చేయడం అత్యంత కష్టతరం. అయినప్పటికీ ఎనోని అద్వితియంగా పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకుని.. చివరికి అధికారిక యూనిఫాం ధరించి డ్రిల్ స్క్వేర్‌పై కవాతు చేస్తూ..అనుకున్న లక్ష్యాన్ని సాధించా అంటూ ఒక విధమైన ఉద్విగ్నానికి గురయ్యేది.
ఇది ఆమె వ్యక్తిగత విజయం మాత్రమే కాదు ఒక చరిత్రగా మారింది. ఎందుకంటే తన మావో నాగ కమ్యూనిటీ నుంచి అధికారణిగా భారత ఆర్మీ నయూనిఫాం ధరించిన తొలి మహిళ ఆమె. అలాగే ఈశాన్య భారతదేశం నుంచి ఆర్మీకి నాయకత్వం వహించిన తొలి తొలి మహిళ కూడా ఎనోనినే కావడం విశేషం.


