మణిపూర్‌ హింసపై నివేదిక ఇవ్వండి | Supreme Court Orders CBI Status Report on 2023 Manipur Ethnic Violence Case | Sakshi
Sakshi News home page

మణిపూర్‌ హింసపై నివేదిక ఇవ్వండి

Feb 14 2026 6:02 AM | Updated on Feb 14 2026 6:02 AM

Supreme Court Orders CBI Status Report on 2023 Manipur Ethnic Violence Case

సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం 

మణిపూర్‌ హింసపై నివేదిక ఇవ్వండి

సీబీఐకి సుప్రీంకోర్టు ఆదేశం 

న్యూఢిల్లీ: మణిపూర్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు శుక్రవారం సీబీఐని ఆదేశించింది. అదేవిధంగా, సుప్రీంకోర్టుకు బదులుగా మణిపూర్‌ హైకోర్టు లేదా గౌహతి హైకోర్టు లేదా రెండు కోర్టులు కలిపి అక్కడ చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలు, ఇతర పరిణామాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ బాధ్యతలు అప్పగించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. 

మణిపూర్‌ హింసాత్మక ఘటనల బాధితుల పునరావాసం, సంక్షేమంపై ఏర్పాటైన జస్టిస్‌ గీతా మిట్టల్‌ కమిటీ సిఫారసులను తప్పనిసరిగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. జాతుల మధ్య వైరంతో 2023లో మణిపూర్‌లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలకు సంబంధించి దాఖలైన 11 ఎఫ్‌ఐఆర్‌లపై శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చిల ధర్మాసనం విచారణ చేపట్టింది.

 ‘బాధితులకు న్యాయం చేకూర్చేందుకు, పునరావాసం కల్పించేందుకు ఏర్పాటు చేసిన రెండు కమిటీలు 27 నివేదికలను కోర్టుకు అందజేశాయి. మా చేతికి ఒక్కటీ అందలేదు. అయితే, ఆ నివేదికల్లోని అత్యంత సున్నితమైన అంశాలు లీకవుతాయేమోనని ఆందోళన చెందుతున్నాం’అని ధర్మాసనం పేర్కొంది. బాధితుల తరఫు లాయర్‌ గొన్జాల్వెస్‌ స్పందిస్తూ సున్నితమైన అంశాలను తొలగించడం లేదా నల్లటి గీతతో మూసివేయవచ్చని సూచించారు. 

అదేవిధంగా, గ్యాంగ్‌ రేప్‌నకు గురైన కుకీ వర్గానికి చెందిన బాధితురాలు ఇటీవలే చనిపోయారని సీనియర్‌ లాయర్‌ వృందా గ్రోవర్‌ తెలిపారు. ఈ కేసులో చార్జిషీట్‌ వేసిన సీబీఐ అధికారులు బాధితురాలి కుమార్తెకు అందుకు సంబంధించిన సమాచారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. ‘దిగువ కోర్టులో ఈ కేసు విచారణకు రాగా సీబీఐ ప్రతినిధి రాలేదు. ప్రధాన నిందితుడిని హాజరుపర్చలేదు. అధికారుల నిర్లక్ష్యం చూసి షాకవుతున్నాం’అని వ్యాఖ్యానించారు. తక్షణమే ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement