భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన (Smriti Mandhana)కు కాబోయే భర్త పలాష్ ముచ్చల్ (Palash Mucchal)పై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. అతడు స్మృతిని మోసం చేశాడంటూ సంచలన ఆరోపణలు వచ్చాయి. పెళ్లికి ముందు రాత్రే స్మృతికి ఈ విషయం తెలిసిందని.. వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేయడానికి ఇదే కారణమనే వదంతులు వ్యాపిస్తున్నాయి.
ఇండోర్ కోడలు కాబోతోంది అంటూ
కాగా మహారాష్ట్రకు చెందిన స్మృతి మంధాన.. ఇండోర్ మూలాలున్న పలాష్ ముచ్చల్‌తో 2019 నుంచి డేటింగ్‌లో ఉంది. కొన్నాళ్ల క్రితం వీరిద్దరు తమ ప్రేమ బంధాన్ని అధికారికంగా వెల్లడించారు. స్మృతి భారత క్రికెట్ జట్టు ఓపెనర్, వైస్ కెప్టెన్‌గా రాణిస్తుండగా.. పలాష్ బాలీవుడ్‌లో సంగీత దర్శకుడిగా అదృష్టం పరీక్షించుకుంటున్నాడు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత స్మృతి పెళ్లి వార్త తెరమీదకు వచ్చింది. పలాష్ సైతం.. ‘త్వరలోనే స్మృతి ఇండోర్ కోడలు కాబోతోంది’ అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి నిశ్చితార్థపు ఉంగరాన్ని చూపిస్తూ.. తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిన విషయాన్ని స్మృతి ధ్రువీకరించింది.
తండ్రికి గుండెపోటు!
ఆ తర్వాత పలాష్.. స్మృతి వరల్డ్‌కప్ గెలిచిన డీవై పాటిల్ స్టేడియంలోనే ఆమెకు ప్రపోజ్ చేసి సర్‌ప్రైజ్ చేశాడు. అనంతరం హల్దీ, సంగీత్ వేడుకల్లో జంటగా సందడి చేశారు. నవంబరు 23న వివాహానికి కొన్ని గంటల ముందు వీరి పెళ్లి వాయిదా పడిందనే వార్త బయటకు వచ్చింది.
తండ్రికి గుండెపోటు వచ్చిన కారణంగా ఆస్పత్రిలో చేరడంతో తన పెళ్లిని నిరవధికంగా వాయిదా వేయాలని స్మృతి చెప్పినట్లు ఆమె మేనేజర్ వెల్లడించాడు. ఆ తర్వాత అనూహ్యంగా పలాష్ కూడా ఆస్పత్రి పాలయ్యాడు. ఈ నేపథ్యంలోనే నెటిజన్లు సంచలన విషయాలు తెరమీదకు తెచ్చారు.
‘బంధం’ పాతబడిందని..
కొరిగ్రాఫర్ అని చెప్పుకొనే మేరీ డికోస్టా పేరుతో.. పలాష్ తనతో చాట్ చేసినట్లుగా స్క్రీన్ షాట్స్ బయటకు వచ్చాయి. ఇందులో పలాష్.. స్మృతి గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనతో ‘బంధం’ పాతబడిందని.. మేరీని తనతో డేటింగ్‌కు రావాల్సిందిగా, ఎంజాయ్ చేద్దామంటూ ‘పర్సనల్’ చాట్ చేసినట్లు వైరల్ అవుతోంది.
నిజమేనా?
ఈ విషయాన్ని గుర్తించిన స్మృతి తండ్రి.. పలాష్‌ను నిలదీయడంతో గొడవకు దారి తీసిందని.. అప్పుడే ఆయనకు గుండెపోటు వచ్చిందని గాసిప్‌రాయుళ్లు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. మరోవైపు.. పెళ్లికి సంబంధించిన వీడియోలు డిలీట్ చేసినప్పటికీ.. పలాష్‌తో గతంలో దిగిన ఫొటోలన్నీ స్మృతి అలాగే ఉంచింది.
ఈ నేపథ్యంలో స్మృతి- పలాష్ బంధం గిట్టని వాళ్లే ఇలా చేస్తున్నారని.. స్మృతి తండ్రి కోలుకోగానే.. వీరి పెళ్లి జరుగుతుందంటూ అభిమానులు అండగా నిలుస్తున్నారు.
అయితే, నెట్టింట ఇంత రచ్చ జరుగుతున్నా ఇరు కుటుంబాల నుంచి నేరుగా ఎటువంటి స్పందనా రాలేదు. పలాష్ అక్క, బాలీవుడ్ గాయని పాలక్ ముచ్చల్ మాత్రం.. ‘‘స్మృతి తండ్రి అనారోగ్యం వల్లే పెళ్లిని ప్రస్తుతానికి నిలిపివేశారు. ఈ సమయంలో మా గోప్యతకు భంగం కలిగించకండి’’ అని ఇన్‌స్టా వేదికగా నెటిజన్లకు విజ్ఞప్తి చేసింది.
చదవండి: స్మృతి కాదు.. నా కుమారుడే పెళ్లి ఆపేశాడు: పలాష్ ముచ్చల్ తల్లి


