సినీ తారలు అన్నాక.. రకరకాల రూమర్స్ వస్తుంటాయి. సోషల్ మీడియాలో ఏవోవో రాస్తుంటారు. ప్రేమలో పడకపోయినా..త్వరలోనే పెళ్లి అంటూ పోస్టులు పెడుతుంటారు. ఇక డేటింగ్ రూమర్స్ గురించి చెప్పనక్కర్లేదు. అయితే ఇలాంటి పుకార్లను కొంతమంది నటీనటులు పర్సనల్‌గా తీసుకుంటారు. బాధ పడతారు. భయపడతారు.. ఖండిస్తారు. మరికొంతమంది అయితే.. ఎన్ని పుకార్లు వచ్చిన పట్టించుకోరు. దానిపై ఒక్క మాట కూడా మాట్లాడకుండా..తమ పని తాము చేసుకొని వెళ్తారు. తాను కూడా ఆ బాపతే అంటోంది అందాల తార మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary). ట్రోలింగ్, రూమర్స్ అనేవి పిచ్చ లైట్‌గా తీసుకుంటానని చెబుతోంది.
ఇటీవల మీనాక్షి ప్రేమ, పెళ్లిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్‌తో ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వినిపించాయి. అయితే మీనాక్షి మాత్రం ఈ రూమర్స్‌ని ఖండించింది. సుశాంత్ తనకు మంచి స్నేహితుడు మాత్రమే అని..అంతకు మించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని స్పష్టం చేసింది. అయినా కూడా రూమర్స్ ఆగడం లేదు. అయితే ఇలాంటి పుకార్లను చూసి నవ్వుకుంటానే తప్ప అస్సలు హార్ట్‌కు తీసుకోనని మీనాక్షి చెప్పింది.
ఆమె నటించిన తాజా చిత్రం ‘అనగనగ ఒకరాజు’ జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ‘సోసల్ మీడియాలో వచ్చే రూమర్స్‌ని ఎలా తీసుకుంటారు?’ అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు పై విధంగా సమాధానంగా చెప్పింది. సెలెబ్రెటీల పెళ్లిపై పుకార్లు రావడం కామన్.. ఇప్పటికే నాకు సోషల్ మీడియాలో చాలా సార్లు పెళ్లి చేశారంటూ మీనాక్షి నవ్వేసింది.


