భారత మహిళ క్రికెట్ జట్టు ఈ ఏడాది ఆఖరి మ్యాచ్ ఆడేందుకు సిద్దమైంది. మంగళవారం తిరువనంతపురం వేదికగా శ్రీలంక మహిళలతో ఐదో టీ20లో భారత్ తలపడనుంది. చివరి పోరులో కూడా గెలిచి సిరీస్‌ను 5-0 క్లీన్ స్వీప్ చేయాలని మన అమ్మాయిల జట్టు పట్టుదలతో ఉంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన, ఆల్ రౌండర్ దీప్తి శర్మలను అరుదైన రికార్డులు ఊరిస్తున్నాయి.
గిల్ రికార్డుపై కన్ను..
స్మృతి మంధాన మంధాన ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉంది. ఈ ఏడాదిలో మంధాన అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు 1703 పరుగులు చేసింది. మహిళల క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా స్మృతి కొనసాగుతోంది. అయితే ఇప్పుడు ఐదో టీ20లో ఆమె మరో 62 పరుగులు చేస్తే.. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్(మెన్స్ అండ్ ఉమెన్స్)లో ఒక ఏడాదిలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్‌గా వరల్డ్ రికార్డు సృష్టించనుంది.
ప్రస్తుతం ఈ రికార్డు టీమిండియా వన్డే, టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేరిట ఉంది. గిల్ 2025 ఏడాదిలో మూడు ఫార్మాట్లు కలిపి 1764 పరుగులు చేశాడు. మరి ఈ మ్యాచ్‌లో గిల్ రికార్డు బ్రేక్ అవుతుందో లేదో వేచి చూడాలి. నాలుగో టీ20లో మాత్రం మంధాన విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడింది. 48 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 పరుగులు చేసింది.
ఒకే ఒక వికెట్..
మరోవైపు భారత స్పిన్ ఆల్ రౌండర్ దీప్తి శర్మ టీ20ల్లో సరికొత్త చరిత్ర సృష్టించేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ మ్యాచ్‌లో దీప్తీ ఒక్క వికెట్ సాధిస్తే టీ20ల్లో లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలుస్తోంది. దీప్తి ప్రస్తుతం 151 వికెట్లతో ఆస్ట్రేలియా ప్లేయర్ మేగాన్ షుట్‌తో కలిసి జాయింట్ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉంది.
మహిళల టీ20లలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు
1 - మేగాన్ షుట్: 122 ఇన్నింగ్స్‌లలో 151 వికెట్లు
2 - దీప్తి శర్మ: 129 ఇన్నింగ్స్‌లలో 151 వికెట్లు
3 - హెన్రియెట్ ఇషిమ్వే: 111 ఇన్నింగ్స్‌లలో 144 వికెట్లు
4 - నిదా దార్: 152 ఇన్నింగ్స్‌లలో 144 వికెట్లు
5 - సోఫీ ఎక్లెస్టోన్: 100 ఇన్నింగ్స్‌లలో 142 వికెట్లు


