భారత మహిళా స్టార్ క్రికెటర్ స్మృతి మంధానకు గతేడాది గొప్ప అనుభూతితో పాటు.. చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముఖ్యంగా 2025 సంవత్సరాంతం ఆమె జీవితంలో మరుపురానిదిగా మిగిలిపోనుంది. ఇప్పటికే మహిళల క్రికెట్‌లో ఎన్నో రికార్డులు కొల్లగొట్టిన ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు వరల్డ్‌కప్‌ను ముద్దాడాలన్న చిరకాల కోరిక నవంబరులో తీరింది.
ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన వన్డే ప్రపంచకప్-2025 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి.. భారత మహిళా జట్టు తొలిసారి జగజ్జేతగా నిలిచింది. ఈ విజయంలో ఓపెనర్‌గా స్మృతి మంధాన తన వంతు పాత్ర పోషించింది. కెరీర్‌లోని అత్యుత్తమ గెలుపు తర్వాత.. అదే నెలలో వ్యక్తిగత జీవితంలోనూ స్మృతి మంధాన (Smriti Mandhana) కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైంది.
అనూహ్య రీతిలో వాయిదా.. ఆపై రద్దు
దాదాపు ఆరేళ్లుగా తనతో ప్రేమ బంధం కొనసాగించిన బాలీవుడ్ మ్యూజిక్ కంపోజర్ పలాష్ ముచ్చల్ (Palash Mucchal)తో ఏడడుగులు వేసేందుకు స్మృతి సిద్ధమైంది. అందుకు అనుగుణంగా ఇరు కుటుంబాల సమక్షంలో హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు ఘనంగా జరిగాయి. మరికొన్ని గంటల్లో (నవంబరు 23) పెళ్లి తంతు మొదలుకానుండగా అనూహ్య ఘటనలు చోటు చేసుకున్నాయి.
స్మృతి తండ్రికి తొలుత గుండెపోటు రాగా.. పలాష్ సైతం ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో పెళ్లి వాయిదా పడింది. అయితే, ఆ తర్వాత సోషల్ మీడియాలో పలాష్ గురించి పెద్ద ఎత్తు చర్చ మొదలైంది. స్మృతితో తన బంధాన్ని కించపరిచేలా.. తనతో అతడు చాట్ చేశాడంటూ ‘ప్రైవేటు’ సంభాషణను ఓ అమ్మాయి షేర్ చేసింది. పలాష్ స్త్రీలోలుడు అనేలా ఆ మెసేజ్‌లు ఉన్నాయి.
అధికారికంగా ప్రకటించి..
ఈ నేపథ్యంలో చాన్నాళ్ల వరకు ఈ విషయంపై ఇరు కుటుంబాలు మౌనం వహించగా.. పలాష్‌పై ట్రోలింగ్ ఎక్కువైంది. ఈ క్రమంలో తాము పెళ్లిని రద్దు చేసుకున్నామంటూ స్మృతి- పలాష్ అధికారికంగా వెల్లడించారు. ఈ సందర్భంగా తనకు ఆటే ముఖ్యమని.. ఇకపై క్రికెట్ మీద మాత్రమే దృష్టి పెడతానంటూ స్మృతి పేర్కొంది.
అందుకు అనుగుణంగానే ఇటీవల శ్రీలంకతో టీ20 సిరీస్‌లో అదరగొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో పది వేల పరుగుల క్లబ్‌లో చేరింది. ఇక 2025లో ఓవరాల్‌గా 1703 పరుగులు సాధించి.. క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన మహిళా క్రికెటర్‌గా నిలిచింది. వ్యక్తిగత జీవితంలోని చేదు అనుభవాన్ని దిగమింగి.. టీ20 ప్రపంచకప్-2026లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.
2025కు గుడ్‌బై.. ఉన్నదంతా కోల్పోయామంటే..
ఈ నేపథ్యంలో 2025కు సంబంధించిన జ్ఞాపకాలతో కూడిన వీడియోను షేర్ చేసిన స్మృతి మంధాన.. గీతలో కృష్ణుడు చెప్పిన మాటలను పంచుకుంది. ‘‘ఏదైనా గొప్ప విషయం, మంచి జరిగే ముందు.. అప్పటి వరకు ఉన్నదంతా కోల్పోతాము.
కాబట్టి ఓపికగా ఎదురుచూడటమే ఉత్తమం’’ అని స్మృతి పేర్కొంది. ఇక ఈ వీడియోలో తన స్నేహితులు, సహచర ఆటగాళ్లు.. అమ్మానాన్న, అన్నయ్య, మేనల్లుడితో ఉన్న ఫొటోలను కూడా ఆమె జత చేసింది. ఈ మేరకు 2025కు గుడ్‌బై చెబుతూ స్మృతి పెట్టిన పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.
చదవండి: 2026: ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న కోహ్లి పోస్ట్


