భారత గడ్డపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు సత్తా చాటింది. స్వదేశంలో టీమిండియాను టెస్టుల్లో 2-0తో వైట్‌వాష్ చేసింది. ఇరవై ఐదేళ్ల క్రితం నాటి ఫలితాన్ని పునరావృతం చేసి రెండోసారి ఈ ఘనత సాధించింది. ఈ క్రమంలోనే సౌతాఫ్రికా ఓ ప్రపంచ రికార్డు తన ఖాతాలో వేసుకుంది.
ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (WTC)-2025 ఫైనల్లో విజేతగా నిలిచి ఐసీసీ ‘గద’ను గెలుచుకున్న సౌతాఫ్రికా.. డబ్ల్యూటీసీ తాజా సీజన్‌లోనూ సత్తా చాటుతోంది. ముఖ్యంగా ఆసియాలో ఈ ఏడాది తొలుత పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌ను 1-1తో డ్రా చేసుకున్న సఫారీలు.. అనూహ్య రీతిలో టీమిండియాను 2-0తో క్లీన్‌స్వీప్ చేశారు.
408 పరుగుల భారీ తేడాతో
రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టులో ముప్పై పరుగుల తేడాతో భారత్‌పై గెలిచిన సౌతాఫ్రికా.. గువాహటిలో చరిత్ర సృష్టించింది. తొలిసారి టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇచ్చిన బర్సపరా స్టేడియంలో ఆద్యంత ఆధిపత్యం కనబరిచి.. టీమిండియా (IND vs SA 2nd Test)ను ఏకంగా 408 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది.
తొలి జట్టుగా చరిత్ర
తద్వారా ప్రపంచంలో ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని ఘనతను సౌతాఫ్రికా తన ఖాతాలో వేసుకుంది. టెస్టుల్లో భారత్‌పై 400 పైచిలుకు పరుగుల తేడాతో గెలిచిన తొలి జట్టుగా చరిత్ర లిఖించింది. గతంలో ఆస్ట్రేలియా నాగ్‌పూర్ వేదికగా టీమిండియాపై 342 పరుగుల తేడాతో గెలవగా.. సౌతాఫ్రికా ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది.
కాగా టీమిండియాను వైట్‌వాష్ చేయడంలో సౌతాఫ్రికా బౌలర్లది కీలక పాత్ర. పేసర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) రెండో టెస్టులో సత్తా చాటి ప్లేయర్‌గా నిలవగా.. సఫారీ పేసర్ సైమన్ హార్మర్ రెండు మ్యాచ్‌లలో కలిపి మొత్తంగా 17 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు.
టెస్టు క్రికెట్ చరిత్రలో భారత జట్టుకు ఘోర పరాజయాలు (పరుగుల పరంగా)
🏏సౌతాఫ్రికా చేతిలో 408 పరుగుల తేడాతో ఓటమి- 2025, గువాహటి
🏏ఆస్ట్రేలియా చేతిలో 342 పరుగుల తేడాతో ఓటమి- 2008, నాగ్‌పూర్
🏏పాకిస్తాన్ చేతిలో 341 పరుగుల తేడాతో ఓటమి- 2006, కరాచి
🏏ఆస్ట్రేలియా చేతిలో 337 పరుగుల తేడాతో ఓటమి- 2007, మెల్‌బోర్న్
🏏ఆస్ట్రేలియా చేతిలో 333 పరుగుల తేడాతో ఓటమి- 2017, పూణె.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా రెండో టెస్టు సంక్షిప్త స్కోర్లు
👉వేదిక: బర్సపరా స్టేడియం, గువాహటి
👉టాస్: సౌతాఫ్రికా.. తొలుత బ్యాటింగ్
👉సౌతాఫ్రికా స్కోర్లు: 489 &260/5 డిక్లేర్డ్
👉భారత్ స్కోర్లు: 201 &140
👉ఫలితం: 408 పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలుపు.. సిరీస్ 2-0తో వైట్‌వాష్.


