న్యూఢిల్లీ: అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ సమాఖ్య (ఐటీటీఎఫ్) వరల్డ్ యూత్ చాంపియన్‌షిప్‌లో భారత జట్లు రెండు పతకాలు సాధించాయి. రొమేనియా వేదికగా జరిగిన ఈ టోర్నమెంట్‌లో భారత బాలుర అండర్–19 జట్టు రజత పతకంతో మెరవగా... బాలికల అండర్–15 జట్టు కాంస్యం సాధించింది. చక్కటి ఆటతీరుతో ఫైనల్‌కు చేరుకున్న బాలుర అండర్–19 జట్టు బుధవారం జరిగిన ఫైనల్లో 0–3తో జపాన్ చేతిలో ఓడింది.
అంకుర్ 17–15, 6–11, 12–10, 4–11, 11–13తో రైసీ కవాకమి (జపాన్) చేతిలో పోరాడి ఓడగా... అభినందర్ 7–11, 8–11, 6–11తో కజకి యోషియామా (జపాన్) చేతిలో ఓడాడు. మూడో సింగిల్స్ మ్యాచ్‌లో ప్రియానుజ్ భట్టాచార్య 9–11, 7–11, 3–11తో టమిటో వటనబే (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు.
అంతకుముందు సెమీస్‌లో భారత జట్టు 3–2తో చైనీస్ తైపీపై విజయం సాధించింది. బాలికల అండర్–15 జట్టు సెమీఫైనల్లో 0–3తో దక్షిణ కొరియా చేతిలో ఓడింది. తొలిసారి ఈ టోర్నీ బరిలోకి దిగిన భారత అమ్మాయిల అండర్–15 జట్టు క్వార్టర్స్‌లో 3–1తో జర్మనీపై గెలిచింది. బాలికల అండర్–19 క్వార్టర్ ఫైనల్లో భారత్ 2–3తో చైనీస్ తైపీ చేతిలో ఓడింది.


