IND vs NZ: రిపోర్టర్‌పై మండిపడ్డ టీమిండియా స్టార్‌ | What Cricket: Harshit Rana Fumes At Reporter After Win vs NZ 1st ODI | Sakshi
Sakshi News home page

IND vs NZ: రిపోర్టర్‌పై మండిపడ్డ టీమిండియా స్టార్‌

Jan 12 2026 5:49 PM | Updated on Jan 12 2026 6:27 PM

What Cricket: Harshit Rana Fumes At Reporter After Win vs NZ 1st ODI

స్వదేశంలో న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా శుభారంభం అందుకుంది. వడోదర వేదికగా ఆదివారం కివీస్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలిచి 1-0తో ముందంజ వేసింది. విరాట్‌ కోహ్లి (Virat Kohli- 93) అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి సత్తా చాటి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ క్రికెటర్‌ హర్షిత్‌ రాణా (Harshit Rana) సైతం మెరుగ్గా రాణించాడు. అర్ధ శతకాలతో అదరగొట్టిన న్యూజిలాండ్‌ ఓపెనర్లు డెవాన్‌ కాన్వే (Devon Conway- 56), హెన్రీ నికోల్స్‌ (62) రూపంలో రెండు కీలక వికెట్లు కూల్చాడు ఈ రైటార్మ్‌ పేసర్‌.

ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి
అదే విధంగా.. న్యూజిలాండ్‌ విధించిన 301 పరుగుల లక్ష్య ఛేదనలో ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన హర్షిత్‌ రాణా.. 23 బంతులు ఎదుర్కొని 29 పరుగులు సాధించాడు. జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు.

బుమ్రా గైర్హాజరీలో
ఈ క్రమంలో కివీస్‌పై టీమిండియా గెలుపు అనంతరం హర్షిత్‌ రాణా మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఓ రిపోర్టర్‌.. ‘‘జస్‌ప్రీత్‌ బుమ్రా గైర్హాజరీలో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాము. భారత బౌలింగ్‌లో తడబాటు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

కొత్త బంతితో మనవాళ్లు అంత తేలికగా వికెట్లు తీయలేకపోతున్నారు. ఇందుకు గల కారణం ఏమిటి?’’ అని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి లోనైన హర్షిత్‌ రాణా.. ‘‘మీరు అసలు ఎలాంటి క్రికెట్‌ చూశారో నాకైతే అర్థం కావడం లేదు.

మండిపడ్డ టీమిండియా హర్షిత్‌ రాణా
ఈరోజు సిరాజ్‌ వికెట్లు తీయలేకపోయినా మెరుగ్గా బౌలింగ్‌ చేశాడు. కొత్త బంతితో మేము మరీ ఎక్కువగా పరుగులు కూడా ఇచ్చుకోలేదు. అయినా కొత్త బంతితో వికెట్లు తీయడం కుదరలేదంటే.. మిడిల్‌ ఓవర్లలో వికెట్లు తీయలేమని కాదు కదా!.. మేము మధ్య ఓవర్లలో వికెట్లు తీశాము’’ అంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కాగా టీ20 ప్రపంచకప్‌-2026 సన్నాహకాల్లో భాగంగా భారత ప్రధాన పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రాకు న్యూజిలాండ్‌తో వన్డేల నుంచి విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త బంతితో వికెట్లు తీయడంలో టీమిండియా తడబడిన మాట వాస్తవమే. కాన్వే, నికోల్స్‌ కలిసి తొలి వికెట్‌కు ఏకంగా 117 పరుగులు జోడించడం ఇందుకు నిదర్శనం.

ఆల్‌రౌండర్‌గా 
ఇక టీమిండియా మేనేజ్‌మెంట్‌ తనను ఆల్‌రౌండర్‌గా చూడాలని భావిస్తోందని హర్షిత్‌ రాణా ఈ సందర్భంగా వెల్లడించాడు. ఇందుకు తగినట్లుగానే తాను నెట్స్‌లో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేస్తున్నట్లు తెలిపాడు. కాగా భారత్‌- న్యూజిలాండ్‌ మధ్య బుధవారం నాటి రెండో వన్డేకు రాజ్‌కోట్‌లోని నిరంజన్‌ షా స్టేడియం వేదిక.   

చదవండి: IND vs NZ: టీమిండియాకు భారీ షాక్‌.. జట్టులోకి ఊహించని ఆటగాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement