చెంగ్డూ (చైనా): ఆసియా అండర్–17, అండర్–15 బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఐదు పతకాలతో తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. ఆదివారం ముగిసిన ఈ టోర్నీలో అండర్–15 బాలికల సింగిల్స్ విభాగంలో షైనా మణిముత్తు... అండర్–17 బాలికల సింగిల్స్ విభాగంలో దీక్ష సుధాకర్ విజేతలుగా అవతరించి స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు.
ఫైనల్స్‌లో షైనా 21–14, 22–20తో చిహారు టొమిటా (జపాన్)పై, దీక్ష 21–16, 21–9తో భారత్‌కే చెందిన లక్ష్య రాజేశ్‌పై విజయం సాధించారు. అండర్–17 బాలుర సింగిల్స్ విభాగంలో జగ్‌షేర్ సింగ్ ఖాన్‌గుర్రా... అండర్–17 మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జగ్‌షేర్ సింగ్ కాజ్లా–జననిక జోడీ సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలు అందుకున్నారు. 2013 తర్వాత భారత్‌కు ఆసియా సబ్ జూనియర్ చాంపియన్‌షిప్‌లో రెండు బంగారు పతకాలు రావడం విశేషం.


