చేతిలో కెమెరా...దాని వెనక వేగంగా కదిలే కన్ను...ప్రతి సందర్భానికీ స్పందించే మనసు... ఇవి ఉంటే చాలు...కదిలే కాలాన్ని బంధించి... చాయాచిత్రంగా చరిత్ర పుటల్లో భద్రపరచవచ్చు. ముందు తరాలకు చెదరని తరగని జ్ఞాపకాలు అందించవచ్చు. దృశ్యాన్ని ఫొటోగా మార్చే సాంకేతిక శక్తి కెమెరాకు ఉండొచ్చు. కానీ దాని వెనక ఉన్న కెమెరామన్ కన్ను అంతకన్నా ముఖ్యం. సకాలంలో స్పందించే హృదయం లేని చేతిలో కెమెరా ఒక బొమ్మ మాత్రమే...అని మాటల ద్వారా కాకుండా తను తీసిన చిత్రాల ద్వారా చెప్పిన అద్భుత ఫొటోగ్రాఫర్ పద్మవిభూషణ్ హొమయ్ వ్యారవాలా.
హొమయ్ వ్యారవాలా ఇండియా మొట్టమొదటి మహిళా ఫొటో జర్నలిస్ట్. భారత దేశం తెల్లదొరల వలసపాలన నుంచి స్వంతంత్ర దేశంగా ఎదిగిన ప్రయాణాన్ని తన చిత్రాల ద్వారా చెప్పిన తొలి ఫొటోగ్రాఫర్ హొమయ్. పురుషాధిపత్యం అధికంగా ఉన్న ఈ ఫొటోగ్రఫీ రంగంలో హోమయ్ హద్దుల్ని, సరిహద్దుల్ని చెరిపేసి స్వేచ్చా విహంగం. ఆకాశమే హద్దుగా తన వృత్తిలో అనుక్షణం జీవించారు. దేశ చరిత్రలో అపురూప ఘట్టాలను చాయాచిత్రాలుగా మలచి ఆ అద్భుత దృశ్య సంపదను మనకు అందించారు. హొమయ్ ని కేవలం ఓ ఫొటోగ్రాఫర్ గా మాత్రమే కాదు.... గత చరిత్ర ప్రత్యక్ష సాక్షిగా చూడాలి. ఈ దేశం పరపాలన నుంచి స్వపరిపాలన దాకా చేసిన ప్రయాణాన్ని ఈ దేశ గత చరిత్రను కెమెరా లో బంధించిన వ్యక్తిగా హొమయ్ కు ప్రత్యేక స్థానం దక్కుతుంది.
హొమయ్ 1913 డిసెబర్ 9న గుజరాత్ రాష్ట్రం నవ్సారిలో ఓ పర్సి కుటుంబంలో జన్మించారు. తండ్రి ఓ టూరింగ్ డ్రమా కంపెనీలో నటుడు. తర్వాతి కాలంలో కుటుంబం బోంబేలో స్థిరపడింది. తల్లి ప్రోత్సాహంతో హుమయ్ బోంబే యూనివర్సిటీ, సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ లో చదువుకున్నారు. ఆసమయంలోనే ఆమెకు ఫొటోగ్రఫీపై దృష్టి మళ్ళింది. 1941 లో హొమయ్ కు మనీక్షా వ్యారవాలాతో వివాహమయ్యింది. అతను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఫొటోగ్రాఫర్, అకౌంటెంట్ గా పనిచేసేవారు.
హొమయ్ 1938లో బొంబే క్రానికల్ పత్రికలో ఫొటోగ్రాఫర్ గా తన కెరీర్ ప్రారంభించారు. ప్రింట్ మీడియా ప్రధాన స్రవంతిలో , ఇల్యుస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియాలో పనిచేసిన మొట్టమొదటి మహిళా ఫొటోగ్రాఫర్ హుమయ్ . డాల్డా 13 అనే మారుపేరుతో ఆమె చిత్రాలు ప్రచురితం అయ్యేవి. ప్రతిరోజూ నగర జీవనంలో అరుదైన దృశ్యాలను ఫొటోలుగా బంధించి పత్రికకు అందించే వారు. ఆ తర్వాత 1940 నుంచి 1970 దాకా ఢిల్లీలో బ్రిటీష్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ కు పనిచేశారు. దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ స్వాంతంత్ర్య దినోత్సవ ప్రసంగం, గాంధీ అంతిమయాత్ర లాంటి చారిత్రాత్మక ఘట్టాలను చిత్రించారు. అలాగే క్వీన్ ఎలిజెబిత్ 2 లాంటి విశిష్ట విదేశీ అతిథులు వచ్చినపుడు వారి చిత్రాలను కెమెరాలో బంధించారు. బ్రిటీస్ పాలన అంతిమదశతో పాటు బారత్ స్వాంతంత్ర్య సంబరాలను చిత్రీకరించారు.
స్వాంతంత్ర్య సమర ఘట్టాల చిత్రాలు ఇప్పటికీ చెక్కు చెదరని జ్ఞాపకాలుగా మనకు మగిల్చిన హొమయ్ కు రోలిఫ్లెక్స్ కెమెరా అంటే ఇష్టం. ఆమె చిత్రాలు మానవీయ కోణంలో, సహజ చిత్రాలుగా ప్రాచుర్యం పొందాయి. ప్రముఖ నేతల చారిత్రక సందర్భాలతో పాటు వారు నడుస్తున్నప్పుడో, నవ్వుతున్నప్పుడో సహజ (క్యాండిడ్) చిత్రాలను తీయడంలో హొమయ్ ది అందెవేసిన చేయి. 1970 లో ఫొటోగ్రఫర్ వృత్తినుంచి హొమయ్ రిటైర్ అయ్యారు. 2011 లో ఆమెకు ప్రతిష్టాత్మక పద్మవిభూషన్ గౌరవం దక్కింది.
ఎప్పుడూ దుమికే జలపాతంలా చురుగ్గా జీవించిన హుమయ్ తమ రిటైర్ జీవితాన్ని గుజరాత్ రాష్ట్రంలోని వడోదరలో చాలా ప్రశాంతంగా గడిపారు. హుమయ్ 2012 జనవరి 15న తమ 98వ ఏట ఈ లోకానికి వీడ్కోలు పలికారు. దేశంలోనే తొలి మహిళా ఫోటోజర్నలిస్ట్ గా.... 1940 లోనే అప్పటి సమాజంలోని పురుషాధిక్యతను నిలదీసిన ధీర మహిళగా హుమయ్ ను మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి.


